పల్లెపోరు వేడెక్కింది. గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. వైఎస్సార్‌సీపీ దూకుడుతో వెళ్తోంది. అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైంది. టీడీపీకి మాత్రం లోకల్ వార్ చెమటలు పట్టిస్తోంది. సరైన అభ్యర్థులు దొరక్క ఆ పార్టీ ఆపసోపాలు పడుతోంది. ఎంపీటీసీల పరిస్థితైతే మరింత దయనీయంగా ఉంది. క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు టీడీపీ తరఫున పోటీ చేసేందుకు గ్రామాల్లో ముందుకు రావడం లేదు. ఓడిపోతామన్న భయం వారిని పట్టుకుంది. జెడ్పీటీసీల విషయంలోనైతే ఎక్కడా క్లారిటీ లేదు. ఇంతవరకు అభ్యర్థుల ఎంపికపై సమావేశం కావడం లేదంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. సమయం దగ్గరపడటంతో ఎవరో ఒకర్ని నిలబెట్టి, మమ అనిపించేద్దామనే అభిప్రాయానికొచ్చేశారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ ఒకపక్క నీరసంతో కుదేలు కాగా.. వైఎస్సార్‌సీపీ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని భావిస్తున్నది. నిరంతరం ప్రజల మధ్యనే ఉండటం ఒక ప్లస్ అయి తే, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందడం మరో ప్లస్‌గా నిలిచింది. ఈ రెండింటికన్నా విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడం మరింత అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడెక్కడ చూసినా వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేయాలన్న ఆత్రుతే కనబడుతున్నది. విజ యం సాధిస్తామన్న ధీమాతో ఆశావహులు పోటీ పడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక నియోజకవర్గ ఎమ్మెల్యేలకు, ఇన్‌చార్జ్‌లకు అప్పగించడంతో ఆశావహుల తాకిడి మరింత ఎక్కువైంది. అయినప్పటికీ ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడిన గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించడంతో అభ్యర్థుల ఎంపిక సులువైంది. నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాలకొండ, రాజాం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలా స, పాతపట్నం నియోజకవర్గాల్లో దాదాపు అభ్యర్థులు ఖరారయ్యారు. మిగతా చోట్ల సోమవారం రాత్రి ఖరారు చేయనున్నారు.
టీడీపీ పరిస్థితి దయనీయం
ఒకప్పుడు జిల్లాలో ఆధిపత్యం చెలాయించిన టీడీపీ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. చేసిన తప్పులు ఊరకనే పోవు అన్నట్టుగా ఆ పార్టీ క్లిష్ట పరిస్థితిలోకి వెళ్లిపోయింది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి అక్రమాలు, వనరుల దోపిడీ, జన్మభూమి కమిటీల ముసుగులో చేసిన అరాచకాలు టీడీపీ నేతలను వదలడం లేదు. జిల్లాలో ఎక్కడా వారికి సానుకూల స్పందన లేదు. ప్రతిచోట ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు పార్టీ అధిష్టానం అమరావతిని తలకెత్తుకోవడం మరింత ఇబ్బందిగా మారింది. మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దు నినాదంతో ముందుకెళ్లడం వలన ప్రజలు హర్షించడం లేదు. ఎక్కడికెళ్లినా నిరసనలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి ప్రతికూలంగా మారడంతో ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడుతున్నారు.
పోటీ చేసి ఓడిపోవడం కన్న తప్పుకోవడం మంచిదనే ఆలోచనకొచ్చారు. దీంతో ఆ పార్టీలో బలమైన నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. గతంలో టిక్కెట్ కోసం పెద్ద ఎత్తున పోటీ పడే నాయకులంతా ఇప్పుడు గమ్మున ఉంటున్నారు. ఇప్పుడీ పరిస్థితుల్లో పోటీ చేయడం అనవసరమని పక్కకు తప్పుకుంటున్నారు. దీంతో జిల్లాలో ఎక్కడా అభ్యర్థుల విషయంలో స్పష్టత లేదు. సాక్షాత్తు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో కూడా సరైన అభ్యర్థులు దొరకక అపసోపాలు పడుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్న ఇచ్ఛాపురంలో కూడా అదే పరిస్థితి నెలకుంది. జెడ్పీటీసీలకే ఇలా ఉందంటే ఎంపీటీసీల విషయంలో మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో పోటీ చేయడానికే భయపడుతున్నారు. పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కల్పించండని పెద్దగా ముందుకు రావడం లేదు.
తప్పని పరిస్థితుల్లో పోటీ..
అధికారం ఉన్నంతకాలం బలమైన నాయకులుగా చెలామణి అయిన వారంతా ఇప్పుడు పోటీకి వెనకాడటంతో ఎవరో ఒకర్ని నిలబెట్టి బరిలో ఉన్నామనిపించుకునేందుకు టీడీపీ నేతలు ప్రస్తుతం ఆరాటపడుతున్నారు. కొందర్ని బతిమలాడి బరిలోకి దించేందుకు ఒత్తిడి చేస్తున్నారు. మరికొందరికీ నయానో భయానో చెప్పి ఒప్పిస్తున్నారు. మొత్తానికి జిల్లాలో ఉన్న 38 జెడ్పీటీసీ స్థానాలకు, 668 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలబెట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పోటీ చేస్తే చాలు మిగతావన్నీ తాము చూసుకుంటామంటూ భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ ఎందుకొచ్చిందని పలుచోట్ల వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటివరకు అభ్యర్థుల ఎంపికపై సిట్టింగే కావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో గెలుపు సంగతి పక్కన పెడితే అభ్యర్థుల నిలబెట్టడమే సవాల్‌గా టీడీపీ నేతలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment