కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నాయకులకు సొంతూళ్లు, సొంత మండలాల్లో చుక్కలు కనిపించాయి. అనూహ్యంగా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులకు మెజార్టీ రావడంతో కంగుతిన్నారు. ఎక్కడైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అయితే, చాలా మంది టీడీపీ అభ్యర్థులు వారి ఇంట (సొంతూళ్లు)నే గెలవలేక చతికిలపడ్డారు. పరాజయం పాలైన వా రిలో రాజకీయ ఉద్దండులు ఉండటం గమనార్హం.
లద్దగిరిలో వైఎస్‌ఆర్‌సీపీదే పైచేయి
ఇది కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి స్వగ్రామం. ఇక్కడ 5,500మంది ఓటర్లు ఉన్నారు. అలాగే కోడుమూరు మండలంలో మొత్తం 52 వేలమంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా రామాంజనేయులు బరిలో ఉన్నారు. ఇప్పటి వరకు లద్దగిరి సూర్యప్రకాష్‌రెడ్డికి కంచుకోట. అయితే, తాజాగా జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జె.సుధాకర్‌కు 994 ఓట్ల మెజార్టీ రావడం గమనార్హం. అయితే, ఎంపీ అభ్యర్థిగా మాత్రం కోట్లకే అధిక ఓట్లు పడ్డాయి. సొంత మండలమైన కోడుమూరులో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు పది వేలకు పైగా మెజార్టీ రావడంతో ఆయన ఖంగుతిన్నాడు.
మాండ్రకు హ్యాండిచ్చిన అల్లూరు
టీడీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాండ్ర శివానందారెడ్డి సొంతూరు నందికొట్కూరు మండలం అల్లూరు. ఇక్కడ మొత్తం 2 వేల ఓట్లు ఉండగా వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థికి 200, ఎమ్మెల్యే అభ్యర్థి తొగురు అర్థర్‌కు 4 వందల మెజార్టీ వచ్చింది. ఈ విధంగా సొంతూరు ఓటర్లు మాండ్రకు హ్యాండిచ్చారు.
ఎదురూరులో వైఎస్‌ఆర్‌సీపీకి ఓట్లు..
కర్నూలు మండల పరిధిలోని ఎదురూరులో టీడీపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పిన వారికే అక్కడి ప్రజలు ఓట్లు వేస్తారు. అయితే ఈసారి మాత్రం అలా జరిగినట్లు కనిపించడంలేదు. ఇక్కడ ఏకంగా విష్ణు ఆదేశాలను కాదని వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా 300 ఓట్లు పడ్డాయి.
కంచుకోటకు బీటలు
పాణ్యం నియోజకవర్గంలోని ఉలిందకొండ టీడీపీకి కంచుకోట. ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డికి ఇది సొంతూరు. దీంతో ఇక్కడ ఎప్పడూ ఆ పార్టీకే మెజార్టీ ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో ఇక్కడ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌రెడ్డికి 596 ఓట్ల మెజార్టీ రావడం విశేషం
గౌరు ఇలాకాలో ఫ్యాన్ గాలి
గౌరు వెంకటరెడ్డి, గౌరు చరితారెడ్డిల సొంతూరు నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు. ఇక్కడ గౌరు కుటుంబానిదే ఎప్పుడూ పైచేయి. ఈసారి ఎన్నికల్లో మాత్రం గౌరు కుటుంబం టీడీపీలోకి వెళ్లి అభ్యర్థి బండి జయరాజుకు ఓట్లు వేయమని చెప్పినా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తొగురు ఆర్థర్‌కు 600 మెజార్టీ వచ్చింది. అలాగే నందికొట్కూరు మండలంలో వైఎస్‌ఆర్‌సీపీకి మొత్తంగా 6 వేల ఓట్ల మెజార్టీ రావడంతో వారి పట్టు సడలిందని స్పష్టమవుతోంది.
వెలుగోడులోబుడ్డాకు ఎదురుగాలి
శ్రీశైలం నియోజకవర్గంలో వెలుగోడు మండలం బుడ్డా రాజశేఖరరెడ్డి కుటుంబానికి కంచుకోట. ఇక్కడ వారు ఏ పార్టీలో ఉన్నా వారు చెప్పిన అభ్యర్థులకే మెజార్టీ ఓట్లు పడేవి. అయితే, ఈసారి ఆయన స్వయంగా రంగంలో ఉన్నా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డికి ఏకంగా 3,496 ఓట్ల అధిక్యం రావడం విశేషం.
కృష్ణగిరిలో కేఈపట్టు జారింది...
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన మండలం కృష్ణగిరి. గతంలో ఈ మండలం డోన్‌లో ఉండేది. ఆ తర్వాత పత్తికొండ నియోజకవర్గంలో కలిపారు. ఈ మండలం ఎక్కడున్నా కేఈ కుటుంబం గెలుపులో కీలకపాత్ర పోసిస్తూ వచ్చింది. ప్రతి ఎన్నికల్లో కనీసం 5 వేల నుంచి 10 వేల మధ్య టీడీపీకి మెజార్టీ వచ్చేంది. అలాంటిది ఈసారి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవికి ఇక్కడ 5 వేల మెజార్టీ వచ్చింది. అలాగే కేఈ కృష్ణమూర్తి సొంతూరు కంబాలపాడులోని 187వ బూతులో వైఎస్‌ఆర్‌సీపీకి 36 మెజార్టీ రావడం గమనార్హం. గ్రామంపై వారి పట్టు సడలిందనడానికి ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
భూమా కోటాలో గంగుల పాగా...
ఎన్నికలు ఏవైనా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా, గంగుల వర్గాల మధ్య పోటా పోటీ ఉంటుంది. ఇందులో దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సొంత మండలమైన దొర్నిపాడులో ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మూడు నాలుగు వేల మెజార్టీ వచ్చేది. అలాగే గంగుల కుటుంబానికి శిరువెళ్ల సొంత మండలం. ఇక్కడ వారికే మెజార్టీ ఉంటుంది. ఈ సారి ఎన్నికల్లో గంగుల కుటుంబం తమ మండలంలో పట్టు నిలుపుకోగా..భూమా కుటుంబం మాత్రం దొర్నిపాడులో పట్టు కోల్పోయింది. ఇక్కడ ప్రత్యర్థి అయిన వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థికి 200 ఓట్ల మెజార్టీ రావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment