ఎన్నికల ఫలితాల్లో కీలకమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం మంత్రి, ఓ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అర్ధరాత్రి దాటాక విందు రాజకీయాలు నిర్వహించి గురువుల ఓట్లకు గాలం వేస్తున్నారు. ‘ఓటుకు ఎంత కావాలో తీసుకోండి... ఎంత తాగాలో తాగండి. ఓటు మాత్రం టీడీపీకే వేయాలి’ అంటూ సంతలో కూరగాయల బేరం పెట్టినట్లు బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు దిగుతున్నారు. మరోవైపు కొందరు ఉపాధ్యాయులు టీడీపీ నేతల్లా వ్యవహరిస్తూ నిజాయితీగా ఉండే గురువులకు మచ్చ తెస్తున్నారు.
సాక్షి, తిరుపతి/ పలమనేరు: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం మంత్రి అమర్‌నాథరెడ్డి ఉపాధ్యాయులకు క్లాస్ తీసుకున్నారు. మరో వైపు మంత్రి పీఏ జిల్లాలోని ఉద్యోగులకు ఫోన్లు చేసి పోస్టల్ బ్యాలె ట్ ఓట్లు మొత్తం టీడీపీకే వేయాలంటూ బెదిరింపులకు దిగారు. చిత్తూరు, పలమనేరులో కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలతో అర్ధరాత్రి దాటాక విందు రాజకీయాలు నెరిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఎంత కావాలో చెప్పమని ఒత్తిడి చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి, టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న రాజకీయ బెదిరింపులకు చేసేది లేక ఉపాధ్యాయులు కొందరు వారు చెప్పింది విని వెళ్లాల్సి వస్తోంది. మంత్రి అమర్‌నాథరెడ్డి పలమనేరులో, చిత్తూరులో టీడీపీ అభ్యర్థి ఏఎస్ మనోహర్ హోటళ్లలో విందు రాజకీయాలు నెరపడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోస్టల్ బ్యాలెట్‌ల కొనుగోళ్లు, టీచర్ల ద్వారా వారి కుటుంబ సభ్యుల ఓట్లు, గ్రామస్థాయిలో పనిచేసే ఉద్యోగులు ఓటర్లను ప్రభావితం చేసే బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. తమకు అలాంటి పనులు వద్దన్నా టీడీపీ నేతలు వారిపై ఒత్తిడి పెంచారు. కేవలం మంత్రి ఒత్తిడితో కొందరు టీచర్లు టీడీపీ కార్యకర్తలుగా మారినట్టు తెలుస్తోంది. ఈవ్యవహారంపై సామాన్య ఓటర్లుసైతం వీరిని చూసి ఏం సార్ రాత్రి పుల్లు డిన్నర్ అంటగా అని అడుగుతుంటే వారికి సమాధానం చెప్పలేక తలదించుకుని వెళ్లాల్సిన పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 50 వేలు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. వీటిని టీడీపీ నేతలు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
అయ్యవార్ల ఓట్లకు బేరం
అయ్యవార్ల ఓట్లకు టీడీపీ నేతలు బేరం పెట్టారు. ఓటుకు ఎంత కావాలో తీసుకోండని అడగడంపై ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు ఇలా వ్యవహరించడానికి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘంలోని కొందరు ఉపాధ్యాయులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి ప్రభుత్వ ఉన్నతపాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు (తాను మంత్రి బంధువునంటూ డీఈఓను సైతం తన చెప్పుచేతల్లో పెట్టుకున్న వ్యక్తి) ఇందులో కీలకంగా ఉన్నట్టు సమాచారం. ఆయన ఇప్పటికే నీరు–చెట్టు అక్రమాల్లో భాగస్వామి. రూ.కోటికి పైగా పనులు చేసినట్లు ఆరోపణలున్నాయి. అలా సంపాదించిన డబ్బుతో ఇప్పుడు మంత్రి కోసం ఉపాధ్యాయులను పిలిపించి పైరవీలు చేస్తున్నారు. ఇదే నియోజకవర్గంలోని మాజీ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నేతలు, బైరెడ్డిపల్లి మండలానికి చెందిన ఓ టీచర్, గంగవరం మండలానికి చెందిన యూనియన్‌లో కీలక వ్యక్తి, ఓ మైనారిటీ టీచర్, స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం చేసే మరో ఉపాధ్యాయుడితో పాటు మరో నలుగురు ఈ వ్యవహారంలో కీలక పాత్రపోసిస్తున్నారు. గతంలో ఇక్కడే ఎంఈఓగా ఉండి ఆపై ఎమ్మెల్సీగా పోటీచేసి ఓడిన ఓ కీలక వ్యక్తి సూత్రదారి అయితే... మంత్రి సహాయకుడు మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపినట్టు తెలిసింది. విందుకు హాజరైన మంత్రి వారితో మాట్లాడుతూ ఈ ఎన్నికలు తనకు ప్రతిష్టాత్మకంగా మారాయని తప్పకుండా మీ పోస్టల్‌బ్యాలెట్లను ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. పోస్టల్ బ్యాలెట్‌కు రూ.5 నుంచి రూ.10వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి తోడు ఉద్యోగుల కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల ద్వారా గ్రామాల్లో చెప్పి టీడీపీకి ఓట్లు వేయించాలని ఒప్పించినట్లు తెలిసింది.
మంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు....
జిల్లాలో పలమనేరుతో పాటు చిత్తూరు, కుప్పం నియోజకవర్గంలోని అధికారుల ఫోను నంబర్లను సేకరించారు. మంత్రి కార్యాలయం నుంచి ఆయన సహాయకుడు ఫోన్లు చేస్తున్నారు. కొందరు బెదిరిస్తే... మరి కొందరికి ఎంత కావాలో చెప్పమని ఒత్తిడి చేస్తున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో టీచర్లకు, ఉద్యోగులకు సమస్యలు తప్పలేదు. మూడేళ్లుగా టీచర్లకు పదోన్నతులు లేవు. పోస్ట్ డేటెడ్ జీఓలతో అరియర్స్ ఇవ్వడం వారికి ఇబ్బందిగా మారింది. బయోమెట్రిక్‌ను వేతనాలకు అనుసంధానం చేయడం, సీపీఎస్‌తో జీవితాలు రోడ్డున పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే పదవీ విరమణ అంటూ చెబుతున్నారు. ఇన్ని ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఉపాధ్యాయులు ఇలా విందులకు హాజరవడం సబబుకాదని పలువురు ఉపాధ్యాయులే విమర్శిస్తున్నారు. ఈ విందు రాజకీయంపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి కొందరు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment