కృష్ణాజిల్లా కైకలూరు మండలం పెంచికలమర్రులో మల్లికార్జునరావు ఇంటిపై వైఎస్సార్ సీపీ జెండాలు
కైకలూరు: కొల్లేరు లంక గ్రామాల్లో సమాంతర పాలన రాజ్యమేలుతోంది. చట్టాలు చట్టబండలవుతున్నాయి. కుల పెదరాయుళ్ల తీర్పుల ముందు స్వేచ్ఛగా ఓటు వేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రామ కట్టుబాట్ల నడుమ ఓటర్లు నలిగిపోతున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తే గ్రామ బహిష్కరణ తప్పదనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొల్లేరును అడ్డాగా చేసుకుని తెలుగుదేశం పార్టీ నేతలు ఓట్ల రాజకీయానికి తెరతీస్తున్నారు.
స్వేచ్ఛాయుతంగా ఓటు వేయడానికి రక్షణగా ప్రత్యేక బలగాలను పంపించాలని ప్రజలు వేడుకుంటున్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 9 మండలాల్లో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. రెండు జిల్లాల్లో కలిపి 122 గ్రామాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు, మండవల్లి మండలాల్లో 18 లంక గ్రామాల్లో ఓటర్లు 16,500 మంది ఉన్నారు. ఈ గ్రామాల్లో 90 శాతం ‘వడ్డీలు’ సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. అనాధిగా ఈ గ్రామాల్లో కుల కట్టుబాట్లతో సమాంతర పాలన కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అదే సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు సీటు కేటాయించింది. దీంతో కుల పెద్దలు టీడీపీకి ఓటు వేయాల్సిందే అని హుకుం జారీ చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ జెండా తీయకపోతే అంతు చూస్తాం!
కృష్జా జిల్లా కైకలూరు మండలంలోని కొల్లేరు లంక గ్రామం పెంచికలమర్రులో 149వ బూత్‌లో 1,093 ఓట్లు, 150వ బూత్‌లో 675 ఓట్లు ఉన్నాయి. ఇదే గ్రామానికి చెందిన ఘంటసాల మల్లిఖార్జునరావు.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానంతో అతని ఇంటిపై వైఎస్సార్‌సీపీ జెండా కట్టుకున్నాడు. కైకలూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) తరఫున ప్రచారం చేస్తున్నాడు. దీంతో గ్రామ పెద్దలు సోమవారం రాత్రి కమ్యూనిటీ హాల్‌లో పంచాయతీ పెట్టి.. అతని కుటుంబాన్ని పిలిపించి కుల కట్టుబాట్లు ధిక్కరిస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ జెండాను పీకేయాలని హుకుం జారీ చేశారు. ఇదే పరిస్థితి అనేక కొల్లేరు లంక గ్రామాల్లో కనిపిస్తోంది.
భయం గుప్పెట్లో కొల్లేరు గ్రామాలు..
కొల్లేరు కుల పెద్దల హెచ్చరికలకు ఆయా గ్రామాల్లో ఓటర్లు భయంతో వణికిపోతున్నారు. ఇటీవల ప్రజా సంకల్ప యాత్రలో ఈ ప్రాంతానికి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘వడ్డీలు’ సామాజికవర్గంలో స్థానికులు సూచించిన వ్యక్తికి ఎమ్మెల్సీ కేటాయించి కొల్లేరు సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కి అందిస్తామన్నారు.
దీంతో కొల్లేరు గ్రామాల్లో అనేక మంది వైఎస్ జగన్‌పై అభిమానంతో ఉన్నారు. ఈ అభిమానం ఓట్లు రూపంలో పడకుండా కుల పెద్దలు అడ్డుపడుతున్నారు. గ్రామ మైకుల్లో టీడీపీకి తప్ప మరో పార్టీకి సహాకరిస్తే రూ.10,000 జరిమానా వి«ధిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించడానికి పోలీసు బలగాలను కొల్లేరుకు పంపాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment