సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి వ్యతిరేకంగా తుఫాన్ వీస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. తన అనుభవంతో చెప్తున్నానని, టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని తెలిసే పెద్ద మొత్తంలో ధనాన్ని ఖర్చు పెడుతున్నారని.. ఇప్పటి వరకు పదివేల కోట్లు ఖర్చు చేశారని జీవీఎల్ ఆరోపించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పెట్టుబడులు, పరిశ్రమలు లేవని, ప్రతి దానికి తన స్టిక్కర్ వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ వల్లనే కియా మోటర్స్ పరిశ్రమం వచ్చిందని తెలిపారు. దానిని కూడా తానే తీసుకుని వచ్చానని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. రాజకీయ వేలంపాటలా ధన దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఏ పరిశ్రమలో కూడా వంద కోట్ల పెట్టుబడులు పెట్టలేదుకానీ.. ఒక్క నియోజవర్గంలోనే 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల వద్ద లూటీ చేసిన ధనాన్నే మళ్లీ ఎన్నికల్లో ఖర్చుచేస్తున్నారని, ఐటీ సోదాలను అడ్డుకున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. ఐదేళ్లలో ప్రకటనలు తప్ప చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment