తప్పుకొన్నతమ్ముళ్లు..! | TDP Side to Municipal Elections in Mahabubnagar | Sakshi
Sakshi News home page

తప్పుకొన్నతమ్ముళ్లు..!

Published Tue, Jan 14 2020 12:30 PM | Last Updated on Tue, Jan 14 2020 12:30 PM

TDP Side to Municipal Elections in Mahabubnagar - Sakshi

తెలుగు తమ్ముళ్లు సైలెంట్‌ అయ్యారు. ‘పుర’పోరులో పోటీ చేసి ఓటమి పాలవ్వడం కంటే పోటీకి దూరంగా ఉంటే బహుళ ప్రయోజనాలున్నాయని నమ్మారు.పరువు కాపాడుకోవడంతో పాటు ప్రత్యర్థికి సహకరించినట్లుగా చెప్పుకుంటే మున్ముందు ఏదైనా లాభం చేకూరుతుందనే ఆలోచనతో మున్సిపల్‌ ఎన్నికల్లోకొందరు పావులు కదుపుతున్నారు. ఇంకొందరు మాత్రం ఇటు పోటీకీ.. అటు ఇతర అభ్యర్థుల మద్దతుకు దూరంగా ఉండిపోయారు.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘పుర’పోరును సవాల్‌గా తీసుకున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ లాంటి ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థులను రంగంలో దింపితే టీడీపీ మాత్రం పోటీకి దూరంగా ఉండిపోయింది. పార్టీ నుంచి పోటీ చేయాలా? వద్దా? అని కూడా జిల్లా నాయకత్వానికి, పార్టీ కేడర్‌కు స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేకపోయింది. మున్సిపోల్‌ పోరులో అసలు పార్టీ వైఖరి ఏంటో కూడా అర్థం కాక తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు. పలు చోట్ల కొందరు పార్టీ తరుఫున నామినేషన్లు దాఖలు చేస్తే.. చాలా మంది అసలు నామినేషన్ల జోలికే వెళ్లలేదు. అయితే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులకు పార్టీ బీ ఫాంలు వస్తాయో? లేవో? అనే విషయం కూడా తెలియక ఆందోళనతో ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలోని ఎన్నికలు జరగనున్న 17 మున్సిపాలిటీల్లోల పరిధిలో ఉన్న 338 వార్డుల నుంచి కేవలం 63 మంది మాత్రమే టీడీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. ఒకప్పడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి పాలమూరులో ప్రస్తుతం పార్టీకి గడ్డుకాలం వచ్చిందనడానికి ‘పుర’పోరులో ఆ పార్టీ అభ్యర్థుల పోటీయే నిదర్శనంగా చెప్పవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, ఆత్మకూరు, వడ్డేపల్లి పట్టణాల్లో ఒక్కరు కూడా టీడీపీ నుంచి నామినేషన్లు దాఖలు చేయకపోవడం గమనార్హం. మిగిలిన 12స్థానాల్లో 63 మంది మాత్రమే నామినేష్లు దాఖలు చేయగా.. వనపర్తి మున్సిపాలిటీలో అత్యధికంగా 14 మంది నామినేషన్లు వేశారు. అయిజ నుంచి ఎనిమిది, గద్వాల, కొత్తకోట నుంచి ఏడు, నారాయణపేటలో ఆరు, అమరచింత, పెబ్బేరు, కోస్గిల నుంచి ఐదు చొప్పున, కొల్లాపూర్, అలంపూర్‌ నుంచి రెండు చొప్పున, భూత్పూరు, మక్తల్‌మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.

సీనియర్లు సైతంపోటీకి నై
టీడీపీకి కార్యకర్తలే పట్టు, బలం. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పార్టీని నడిపించే సమర్థులైన నాయకులు లేకపోవడంతో కేడర్‌ సైతం తీవ్ర నిస్తేజంలో ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచే సత్తా ఉన్న కార్యకర్తలు ఇప్పటికీ టీడీపీలో ఉన్నారు. కారణమేంటో తెలియదు కానీ వారిలో చాలా మంది రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఇంకొందరు పోటీ చేయకుండా స్థానిక పరిస్థితులు, అభ్యర్థులను బట్టి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు మద్దతు తెలుపుతున్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొందరు కాంగ్రెస్‌కు, ఇంకొందరు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నారు. అమరచింతలో కాంగ్రెస్, ఆత్మకూరులో స్థానిక పరిస్థితులు, పరిచయాలకు అనుగుణంగా టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఇటు మహబూబ్‌నగర్‌లో తాజా మాజీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్‌ బీజేపీలో చేరిన తర్వాత పార్టీ కనుమరుగైందనే చెప్పువచ్చు. దీంతో ఆ పార్టీ శ్రేణులు ఎవరికి మద్దతు తెలపాలో ఇంకా తేల్చుకోలేదు. గద్వాల, అలంపూర్, అయిజలో టీడీపీ ప్రభావం లేదు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలో నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్‌ మున్సిపాలిటీల్లో ఎవరికి మద్దతు తెలపాలో నిర్ణయం తీసుకులేదని.. అధిష్టానం ఆదేశాల మేరకు మద్దతు ఉంటుందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొప్పుల రమేశ్‌ తెలిపారు. మరోవైపు ఇంకా పార్టీ వెన్నంటే ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల అధ్యక్షులు రాములు, పగడాల శ్రీనివాస్‌ తమ తమ పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో మాత్రమే అభ్యర్థులను బరిలో దింపారు.

పార్టీ దుస్థితికి కారణమిదే..
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం.. రాష్ట్ర విభజన అనంతరం న్యాయపరంగా తెలంగాణకు రావాల్సిన నీరు, విద్యుత్‌ వాటా రాకుండా అడుగడుగునా అడ్డుపడుతోన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరిపై జిల్లా ప్రజల్లో ఆనాడే అసంతృప్తి నెలకొంది. దీంతో పాటు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలతో 2014, 2018 అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనం కారుకే జై కొట్టారు. దీంతో అప్పటి పరిస్థితులకనుగుణంగా పలువురు ముఖ్య నేతలు నియోజకవర్గానికి దూరంగా ఉంటే ఇంకొందరు పార్టీలు మారారు. కొన్నాళ్లు పార్టీలో కొనసాగిన  జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్‌ఎస్, బీజేపీలో చేరారు. అయితే 1994 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్నింటిలో టీడీపీ జెండా ఎగిరింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న రేవంత్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డితో పాటు నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు (టీఆర్‌ఎస్‌), నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ (టీఆర్‌ఎస్‌), జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ (బీజేపీ) వంటి ముఖ్య నాయకులు గతంలో టీడీపీలో ఉన్నవారే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement