సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జట్టుకట్టే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ను నిలువరించేందుకు ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తేవాలనే వ్యూహంతో తెరపైకి తెచ్చిన ఈ ప్రతిపాదన లాభనష్టాలపై బేరీజు వేసుకుంటున్నారు. ఇరుపార్టీలు కలసి పోటీచేస్తాయనే ప్రచారంపై క్షేత్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పొత్తుల విషయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. టీడీపీతో పొత్తు ఖాయంగా ఉంటుందని కొందరు నాయకులు బహిరంగంగానే చెబుతున్న పరిస్థితుల్లో పొత్తులపై అధిష్టానమే చూసుకుంటుందని, ఇందులో ఎవరి అభిప్రాయాలూ ఉండవని ఉత్తమ్ పేర్కొనడం వెనుక ఆంతర్యమేమిటనే దానిపై గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో అధిష్టానం కోర్టులోకి బంతిని నెట్టడం వ్యూహమా లేక నష్టనివారణా అనే దానిపై పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
టీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటేనే మేలు...
ఈసారి ఎన్నికల్లో టీడీపీతోపాటు సీపీఐ, తెలంగాణ జన సమితి, సీపీఎంలతో కలసి కూటమి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ తొలుత భావించింది. అయితే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని సీపీఎం స్పష్టం చేయడంతో మిగిలిన పార్టీలతో జట్టుకట్టే అంశంపై టీపీసీసీలో చర్చలు జరుగుతున్నాయి. సీపీఐ, తెలంగాణ జన సమితికి కొన్ని సీట్లు ఇస్తే వారి ఓట్ల సాయంతో మరికొన్ని స్థానాలు గెలవగలమని కొందరు నేతలు భావిస్తున్నారు. కానీ తమ కూటమిలో సీపీఎం చేరకపోవడం వల్ల ఆ పార్టీ ఓటు బ్యాంకు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వెళ్లదని మరికొందరు పేర్కొంటున్నారు. మరికొందరేమో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి మాత్రమే ఉండాలని, ఆ కోణంలోనే ఎన్నికల పొత్తుల నిర్ణయాలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
సెంటిమెంట్ ఇరకాటంలో...
టీడీపీతో పొత్తు ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్ర విభజన చట్టంపై నాడు పార్లమెంటులో జరిగిన చర్చలోనే ప్రత్యేక హోదా అంశాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ చెప్పినప్పటికీ కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేస్తోందని, టీడీపీతో స్నేహం కోసమే ప్రత్యేక హోదాకు మద్దతు పలుకుతోందని రాష్ట్ర మంత్రులు వ్యాఖ్యానించి ఆ పార్టీని ఇరకాటంలో పడేశారు. తెలంగాణ ప్రయోజనాలంటూ సెంటిమెంట్‌ను మళ్లీ రాజేసే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ నేతలను సందిగ్ధంలో పడేసింది.
ఎన్నికలు దగ్గరికొస్తున్న సమయాన పార్టీ గురించి ప్రజల్లో ఇలాంటి చర్చ జరగడం మంచిది కాదనే అభిప్రాయానికి కొందరు కాంగ్రెస్ నేతలు వచ్చారు. టీడీపీతో ఇప్పటి నుంచే దోస్తీ అంటూ చెప్పుకోవడం ద్వారా నష్టమే కానీ లాభం లేదని ఆ నేతలంటున్నారు. ముఖ్యంగా బీజేపీతో అంటకాగే అలవాటున్న చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీతో జతకడితే తన అవసరం కోసం భవిష్యత్తులో కూడా బాబు బీజేపీ గూటికి చేరతారని, అప్పుడు పరిస్థితేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ స్వతహాగా అధికారంలోకి వచ్చిన సందర్భం లేదని, ఏదో పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చే అలవాటున్న బాబును నమ్మి దోస్తీ పడవను ఎక్కువ దూరం నడపలేమని టీపీసీసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
కొన ఊపిరితో టీడీపీ
తెలంగాణలో చాలా తక్కువ నియోజకవర్గాల్లోనే టీడీపీ ప్రభావం చూపే అవకాశం ఉందని, అలాంటప్పుడు కొన ఊపిరితో ఉన్న టీడీపీతో జట్టు కట్టి వారికి కొన్ని స్థానాలిచ్చి గెలిపించి మళ్లీ ఊపిరి పోయడం ఎందుకని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ శివా ర్లలోని సెటిలర్లంతా టీడీపీతో ఉన్నారనేది వాస్త వం కాదని, రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బాబు డ్రామాల కారణంగా సెటిలర్లు కూడా బీజేపీ, టీడీపీపై గుర్రుగా ఉన్నారని ఓ నేత పేర్కొన్నారు. అలాంటప్పుడు టీడీపీతో స్నేహం ఉంటుందని చెప్పడం ద్వారా ఆ పార్టీ నుంచి వచ్చే వలసలు కూడా ఆగిపోతాయని, అలాంటప్పుడు కాంగ్రెస్‌కు ఏం లాభం జరిగినట్టని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాహుల్‌తో భేటీ అయిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment