తూర్పుగోదావరి జిల్లా పల్లంలోని పోలింగ్ బూత్‌కు ఉదయం 8 గంటలకే పోటెత్తిన ఓటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ సరళిని చూస్తే ప్రజా తీర్పు తమకేమాత్రం సానుకూలంగా ఉన్నట్టు కన్పించడం లేదని తెలుగుదేశం వర్గాలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు మార్పు కోరుకున్నారనే విధంగా సంకేతాలు కన్పిస్తున్నాయని కొంతమంది టీడీపీ నాయకులు వ్యాఖ్యానించారు. ఈ తరహా ఓటింగ్‌ను తామెప్పుడూ ఊహించలేదన్నారు. ప్రభుత్వ పథకాలపై జనం పెద్దగా ఆకర్షితులు కాలేదని ఉత్తరాంధ్రకు చెందిన ఓ టీడీపీ నేత విశ్లేషించారు. జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇద్దామనే భావన ఓటర్లలో నెలకొందంటూ జరిగిన ప్రచారమే నిజమైనట్టుగా ఉందని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి పోలింగ్ సరళి టీడీపీకి సానుకూలంగా ఉండేలా చూడాలని చంద్రబాబు క్షేత్రస్థాయి కార్యకర్తలను పురిగొల్పారని, అలాగే పోలింగ్ శాతం పెరిగితే పార్టీకి నష్టమని మొదటి నుంచీ భావించారని, ఇందుకు అనుగుణంగానే కింది స్థాయి కేడర్‌కు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అయితే రికార్డు స్థాయిలో జరిగిన పోలింగ్ టీడీపీ నేతలను కలవర పరుస్తోందని చెప్పారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో నెట్టుకొచ్చిన నియోజకవర్గాల్లో ఈ పరిణామం తమకు ప్రతికూల ఫలితాన్నిచ్చే వీలుందని టీడీపీ ప్రాథమిక అంచనాలకొచ్చింది. తూర్పుగోదావరి జిల్లా పల్లంలోని పోలింగ్ బూత్‌కు ఉదయం 8 గంటలకే పోటెత్తిన ఓటర్లు
బెడిసికొట్టిన టీడీపీ వ్యూహం
పోలింగ్ శాతం పెరిగితే తమకు నష్టమని భావించిన టీడీపీ దాన్ని అడ్డుకునేందుకు అన్ని వ్యూహాలకు పదును పెట్టింది. మార్పు కోరుకునే వారంతా పెద్ద సంఖ్యలో ఓటువేస్తే అది వైఎస్సార్‌సీపీకి సానుకూలమనేది టీడీపీ ఆలోచన. ఇందులో భాగంగానే పోలింగ్ ఆరంభంలోనే ఈవీఎంలు పనిచేయడం లేదని, పోలింగ్ బూత్‌ల వద్ద మైళ్ల కొద్దీ క్యూ ఉందంటూ గందరగోళం సృష్టించేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. ఒకరికి ఓటు వేస్తే మరొకరికి పడుతోందంటూ ప్రచారం చేశాయి. సాధారణ ఓటరు పోలింగ్ బూత్‌కు వెళ్లకుండా చెయ్యాలన్న ప్రయత్నం స్పష్టంగా కన్పించింది. ఈ ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ అతి తక్కువ సమయంలోనే తిప్పికొట్టింది. ఇలాంటి వదంతులు నమ్మొద్దని స్పష్టం చేసింది. ప్రసార మాధ్యమాల్లో ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్లారు. క్యూలో ఉన్న వారికి ఎన్ని గంటల వరకైనా ఓటేసే అవకాశం కల్పిస్తామని కమిషన్ చెప్పడం కూడా పోలింగ్ సరళి పెరగడానికి దోహదపడింది. (చదవండి: రెచ్చిపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తలు)
అరాచకాన్ని తిప్పికొట్టిన జనం
పోలింగ్ సందర్భంగా హింసాత్మక వాతావరణం నెలకొంటే ప్రజలు సాధారణంగా ఓటుకు దూరంగా ఉంటారు. ఇదే సూత్రాన్ని అనుసరించి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు, నేతలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నించారు. సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల పోలింగ్ బూత్ వద్ద ఘర్షణకు దిగారు. విశాఖలో వైఎస్సార్‌సీపీ మహిళా ఎమ్మెల్యేపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి సిద్ధమయ్యారు. కడపలో ఆదినారాయణరెడ్డి అనుయాయులు, అనంతపురంలో పరిటాల వర్గీయులు హింసాత్మక చర్యలకు దిగారు. ఇలాగే మరికొన్ని చోట్ల కూడా హింసను ప్రేరేపించాలని టీడీపీ భావించింది. కానీ వారి ఎత్తుగడను వైఎస్సార్‌సీపీ అభిమానులు తిప్పికొట్టారు. ఓటర్లు కూడా టీడీపీ నేతల ఆగడాలకు ధీటుగా బదులిచ్చారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేందుకు ఇది సంకేతమని గుంటూరుకు చెందిన ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment