యుద్ధం అబద్ధం..లాలూచీ నిజం | Telugu People Criticism in social media on CM Chandrababu | Sakshi
Sakshi News home page

యుద్ధం అబద్ధం..లాలూచీ నిజం

Published Mon, Jun 18 2018 1:43 AM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Telugu People Criticism in social media on CM Chandrababu - Sakshi

నీతి ఆయోగ్‌ సమావేశానికి ఒక్కరోజు ముందు ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ‘యుద్ధ’వ్యూహాలు రచించిన నలుగురు ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఒకే ఫ్రేములోకి వచ్చిన దృశ్యం. మమతా దీదీ, కుమార స్వామి నవ్వుతూ హూందాగానే నిలుచున్నారు. ఆ పక్కన (మోదీ చాటున) పినరయ్‌ విజయన్‌ కూడా మౌనంగానే నిలబడ్డారు. మన బాబుగారు ప్రధాని పట్ల వినయంతో వంగిపోయారు. ముఖమంతా నోరు చేసుకుని నవ్వు పులుముకున్నారు. ప్రధానమంత్రి ఎడమ చేతిని దొరకబుచ్చుకుని (మోదీ స్వయంగా షేక్‌ హ్యాండిస్తే కుడిచెయ్యే ఇచ్చేవారు కదా అన్న నెటిజన్ల విశ్లేషణ ప్రకారం) కరచాలనం గావించారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారనీ, మోదీని కడిగేస్తారనీ, బాబు తొడగొడతారనీ, ఇక జరిగేది కురుక్షేత్ర యుద్ధమేనన్న రీతిలో వారి భజంత్రీ మీడియా దండోరా వేసిన నేపథ్యంలో ఈ ఫొటో జాతీయ వార్తల్లోకి ఎక్కింది. నెటిజన్లు చంద్రబాబును తీవ్రంగా తూర్పారపట్టారు. జాతీయ మీడియా ప్రముఖులు కూడా స్పందించారు. రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ‘పిక్చర్‌ ఆఫ్‌ ది డే’ అంటూ ఈ ఫొటోను ట్వీట్‌ చేశారు. ‘ఇదీ.. రాజనీతి’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాన్ని జోడించారు. వెంటనే శేఖర్‌ గుప్తా అందుకున్నారు. ఈ నలుగురు ‘సెక్యులర్‌’ ముఖ్యమంత్రుల్లో ముగ్గురు గతంలో బీజేపీ ప్రభుత్వంలో భాగం పంచుకున్నారని, చంద్రబాబయితే రెండుసార్లు భాగస్వామిగా ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఈ ఫొటో సాక్షిగా చంద్రబాబు లాలూచీ కుస్తీ జాతీయ స్థాయిలో దిగంబరంగా బయటపడింది.  

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీఎం చంద్రబాబు యుద్ధం ప్రకటిస్తారని రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, ప్రచార గణం హోరెత్తించింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ నీతి ఆయోగ్‌ సమావేశం వేదికగా తొలిసారిగా తారసపడుతున్నారని, రాష్ట్ర సమస్యలపై కేంద్రం వైఖరిని బాబు ఎండగడతారని, అవసరమైతే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తారని ఊదరగొట్టింది. కానీ, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉండడం చూసి ఆంధప్రదేశ్‌ ప్రజానీకం విస్తుపోయింది. ఆదివారం నీతి ఆయోగ్‌ సమావేశం ప్రారంభానికి ముందే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు చంద్రబాబు, మమతా బెనర్జీ, కుమారస్వామి, పినరయి విజయన్‌లు ప్రధానమంత్రి వద్దకు వచ్చారు. ఈ సమయంలో మోదీకి చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తూ.. ఒకింత భక్తిభావంతో వంగి కరచాలనం చేస్తూ కనిపించారు. ఈ దృశ్యాన్ని సోషల్‌ మీడియా, ప్రసార సాధనాల ద్వారా వీక్షించిన ప్రజలు విస్తుపోయారు. కేంద్రంపై యుద్ధం జరగబోతోందని, నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తారన్న వార్తలు నిజమేనని నమ్మిన వారు మోదీ ఎదుట చంద్రబాబు ప్రదర్శించిన వినయ విధేయతలను చూసి భిన్నులయ్యారు. 

అనుకూల మీడియాకు భంగపాటు 
సీఎం చంద్రబాబు తీరుపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో టీడీపీ అనుకూల మీడియా వెంటనే నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. నీతి ఆయోగ్‌ సమావేశం ప్రారంభంలో ప్రధానమంత్రి ముందుగానే తన సీట్లో కూర్చున్నారని, చంద్రబాబు ఆయనను ఏమాత్రం పట్టించుకోకుండానే వెళ్లి తన స్థానంలో కూర్చున్నారని ప్రచారం చేసింది. చంద్రబాబును హీరోగా చిత్రీకరించేందుకు తంటాలు పడింది. కేంద్రంపై యుద్ధం చేస్తారన్న చంద్రబాబు వంగి నిలబడి, నవ్వుతూ మోదీతో కరచాలనం చేయడంతో టీడీపీ అనుకూల మీడియాకు భంగపాటు తప్పలేదు. వాస్తవాలు ఇలా ఉండగా, నీతి ఆయోగ్‌ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు కడిగి పారేశారని, గట్టిగా నిలదీశారని జనాన్ని నమ్మించేందుకు అనుకూల మీడియా, ప్రచార గణాలు అష్టకష్టాలు పడ్డాయి. అసలు జరిగిందేమిటో తెలుసుకున్న ప్రజలు చివరకు నవ్వుకున్నారు. 

సమావేశంలో ఏం జరిగింది? 
నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలు మినహా ఎలాంటి వివరాలను నీతి ఆయోగ్‌ కానీ, ప్రధానమంత్రి కార్యాలయం కానీ విడుదల చేయలేదు. కొన్ని ఫొటోలను మాత్రం నీతి ఆయోగ్‌ ట్విట్టర్‌లో ఉంచింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తాము చేయబోయే ప్రసంగాలు, మాట్లాడబోయే అంశాలను ముందుగానే ప్రాంతీయ మీడియాకు విడుదల చేశారు. నీతి ఆయోగ్‌ పాలక మండలిలో చైర్మన్‌గా ఉన్న ప్రధానమంత్రి సహా 36 మంది సభ్యులు ఉన్నారు. వీరు కాకుండా నీతి ఆయోగ్‌ పూర్తికాలపు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఉన్నారు. ఆదివారం పాలక మండలి సమావేశానికి ఒకరిద్దరు హాజరు కాలేదు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం భోజన విరామం మినహాయించి దాదాపు 5 గంటలపాటు సాగింది. ఎజెండాలోని ఏడు అంశాలను చర్చించేందుకు ప్రతి ముఖ్యమంత్రికి ఏడు నిమిషాల సమయం కేటాయించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ప్రసంగించబోయే అంశాలపై ‘టాకింగ్‌ పాయింట్స్‌’ పేరుతో 13 పేజీల ప్రకటనను ముందుగా మీడియాకు విడుదల చేశారు. 

బాబు ప్రసంగాన్ని రాజ్‌నాథ్‌ అడ్డుకున్నారట! 
నీతి ఆయోగ్‌ సమావేశంలో చంద్రబాబు ‘టాకింగ్‌ పాయింట్స్‌’లోని అంశాలనే చదివారని, ఎలాంటి ఘర్షణ వైఖరిని అనుసరించలేదని తెలిసింది. తనకు ఇచ్చిన సమయం ఏడు నిమిషాలు దాటినప్పుడు సభకు సమన్వయకర్తగా ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సమయం మించిపోయిందని గుర్తుచేయగా.. దీన్ని కూడా చంద్రబాబు ప్రచార గణం అనుకూలంగా వాడుకుంది. రాష్ట్ర సమస్యలను చంద్రబాబు లెవనెత్తితే రాజ్‌నాథ్‌సింగ్‌ మధ్యలో అడ్డుకున్నారని, అయినా చంద్రబాబు లెక్కచేయలేదని, 20 నిమిషాలు మాట్లాడారని టీడీపీ ప్రచార బృందం పేర్కొంది. చంద్రబాబును దమ్మున్న నాయకుడిగా, ప్రధానమంత్రిని ఎదిరించిన ముఖ్యమంత్రిగా చిత్రీకరించేందుకు ఆపసోపాలు పడింది. మొత్తంమీద చంద్రబాబు 12 నిమిషాల్లో తన ప్రసంగాన్ని ముగించారు. 

టాకింగ్‌ పాయింట్స్‌లో ఏముంది? 
చంద్రబాబు చర్చించబోయే అంశాలలను మీడియాకు విడుదల చేసిన ‘టాకింగ్‌ పాయింట్స్‌’లో 13 పేజీల్లో పలు అంశాలను పొందుపరిచారు. అవేమిటంటే...
- ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు రాష్ట్ర విభజన కావాలని అడగకున్నా అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారు. అందువల్ల విభజన హామీలను నెరవేర్చాలి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. 
- రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడం లేదు. నాలుగేళ్లయినా ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో మేమే వెనకంజలో ఉన్నాం. 
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి నిధులు కేంద్రమే భరించాలి. రెండో సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఆమోదించాలి. పెండింగ్‌లో ఉన్న రూ.1,892 కోట్ల బిల్లులను చెల్లించాలి. 
- నూతన రాజధాని అమరావతికి రానున్న ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అవసరం.
- బుందేల్‌ఖండ్‌ తరహాలో వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్రం 2018 ఫిబ్రవరిలో ఇచ్చిన రూ.350 కోట్లను కూడా వెనక్కి తీసుకుంది. 
- రెవెన్యూ లోటును రూ.16,078 కోట్లుగా ‘కాగ్‌’ అంచనా వేయగా, కేంద్రం దానిని రూ.4,117 కోట్లకు తగ్గించింది. అది కూడా విడుదల చేయలేదు. 
- విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పొందుపరిచిన హామీలను అమలు చేయాలి.
- నోట్ల రద్దు విధానానికి మద్దతు పలుకుతున్నాం. అయితే దాన్ని అమలు చేసిన తీరులో లోపాలున్నాయి. 

వాజ్‌పేయికి చంద్రబాబు పరామర్శ 
ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయిని ఆదివారం సాయంత్రం సీఎం చంద్రబాబు పరామర్శించారు. వాజ్‌పేయి కుటుంబ సభ్యుడైన రంజన్‌ భట్టాచార్యను వాజ్‌పేయి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశం ముగిసిన అనంతరం ఎయిమ్స్‌కు వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి విమానాశ్రయానికి చేరుకుని, ఆంధ్రప్రదేశ్‌కు తిరుగు పయనమయ్యారు.  

ఢిల్లీలో ఆదివారం నీతి ఆయోగ్‌ సమావేశం ప్రారంభానికి ముందే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు చంద్రబాబు, మమతా బెనర్జీ, కుమారస్వామి, పినరయి విజయన్‌లు ప్రధానమంత్రి వద్దకు వచ్చారు. ఈ సమయంలో మోదీకి చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తూ.. ఒకింత భక్తిభావంతో వంగి కరచాలనం చేస్తూ కనిపించారు. ఈ దృశ్యంపై ప్రముఖ పాత్రికేయులు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌, శేఖర్‌ గుప్తా చేసిన ట్వీట్స్‌ ఇవి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement