సీఐగా పదోన్నతి లభించిన సందర్భంలో తన నివాసంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి విందు ఇస్తున్న సీఐ నారాయణరెడ్డి (ఫైల్)
సాక్షి, తాడిపత్రి అర్బన్ : తాడిపత్రి రూరల్ సీఐ నారాయణరెడ్డిపై బదిలీ వేటు పడింది. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నందున ఆయనపై ఈసీ చర్యలు తీసుకుంది. రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నారాయణరెడ్డి పనితీరు వివాదాస్పదంగానే ఉంది. ఎస్‌ఐలకు సీఐలుగా పదోన్నతులు ఇచ్చిన తరువాత మొట్టమొదటగా నారాయణరెడ్డి పేరునే పరిశీలించారు. ఎస్‌ఐల నుంచి సిఐగా పదోన్నతి లభిస్తే రెండేళ్ల పాటు లూప్‌లైన్‌లో ఉంచాల్సి ఉంది. ఈ నిబంధనలను పక్కనపెట్టి నారాయణరెడ్డి ఏ స్టేషన్‌లో పనిచేశారో అక్కడే సీఐగా పోస్టింగ్ ఇవ్వడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. దీనికి కారణం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సిఫార్సే కారణమన్న ఆరోపణలు కూడాపెద్ద ఎత్తున వినిపించాయి.
ఇందుకు ఎమ్మెల్యేకు భారీ స్థాయిలో లాబీయింగ్ చేశారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపించాయి. ఇందుకు కృతజ్ఞతగా సీఐ నారాయణరెడ్డి తన సొంత గ్రామమైన వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం లావనూరులో అప్పట్లో భారీ విందు ఇచ్చారు. ఈ విందుకు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిని ఆహ్వానించారు. దీంతో ఎమ్మెల్యే తన అనుచరగణంతో లావనూరుకు వెళ్లడం.. సీఐ ఘన స్వాగతం పలకడం జరిగింది. ఊరేగింపుగా తీసుకెళ్లిన వీడియో అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో సీఐ నారాయణరెడ్డి ఎమ్మెల్యే ఏది చెబితే దానికి తలూపడం, పాటించడం తప్ప లా అండ్ ఆర్డర్‌తో, న్యాయ, అన్యాయాలతో సంబంధం లేకుండా వ్యవహరించడం వివాదాస్పదమైంది.
సీఐ ఏకపక్ష తీరుతోనే సమస్యలు
ముందే తాడిపత్రి సమస్యాత్మక అతి సున్నితమైన ప్రాంతం కావడంతో ఇక్కడ అధికార, విపక్ష పార్టీల మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్నాయి. దీనికితోడు ప్రబోధాశ్రమం ఘటన ఉంది. ఇలాంటి నియోజకవర్గంలో సీఐ అనే అధికారి చాలా పారదర్శకంగా పనిచేసి నిక్కచ్చిగా వ్యవహరించాల్సి ఉంది. అయితే ఇక్కడ సీఐ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. సీఐ నారాయణరెడ్డి ఎమ్మెల్యే ఆదేశాలు పాటించడం తప్ప మరో విషయం తెలియదని, పూర్తిగా జేసీ సోదరులకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని అప్పట్లో వైఎస్సార్‌సీపి నేతలు బాహాటంగా ఆరోపించారు.
గతంలో ఇదే స్టేషన్లో ఎస్‌ఐగా పనిచేసినపుడు కూడా నారాయణరెడ్డి వ్యవహార శైలిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. తిరిగి సీఐగా ఇదే స్టేషన్‌కు పోస్టింగ్ ఇవ్వడంపై విపక్ష నేతలు అదే రీతిలో ఆరోపణలు చేశారు. పోలీసు అధికారులు మాత్రం జేసీ సోదరుల సిఫారస్సు లేనిదే ఇక్కడి నుంచి బదిలీ చేయలేరు, పోస్టింగ్ ఇవ్వలేరు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో సీఐ నారాయణరెడ్డిని బదిలీ చేయడంతో ఎన్నికల కమిషన్(ఈసీ)పై మరింత నమ్మకం కలిగినట్‌లైంది.
ప్రతిపక్షపార్టీ నేతలే ఆయన టార్గెట్
ప్రజాసంకల్ప పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల మైలురాయికి చేరుకున్న సందర్భంగా వైఎస్సార్‌సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి 2018 అక్టోబర్ ఆరో తేదీన పెద్దపప్పూరు మండలంలో చేపట్టిన సంఘీభావ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి చివర్లో నిరాకరించారు. సొంత మండలంలో పెద్దారెడ్డి పాదయాత్ర చేస్తే తమ ఇమేజీ దెబ్బతింటుందన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే తన అనుంగులైన పోలీసు అధికారులను ఉసిగొల్పాడు. ఇందులో భాగంగానే రూరల్ పోలీసులు అప్పట్లో పెద్దారెడ్డి పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు. ఎలాగైనా పాదయాత్ర చేయాలన్న సంకల్పంతో పెద్దారెడ్డి ముచ్చుకోటకు రావడంతో వెంటనే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
- అదే విధంగా యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో 2018 ఆగస్టు 29న జరిగిన చిన్నపాటి ఘర్షణకు వైఎస్సార్‌సీపీ సమన్వకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని బాధ్యుడిని చేస్తూ హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి ఏకపక్షంగా వ్యవహరించారు.
- 2018 సెప్టెంబర్‌లో జేసీ ట్రావెల్స్ బస్సు అద్దాలు ధ్వంసం చేశారన్న నెపంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇవ్వడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది.
- తాడిపత్రి మండలం ఆలూరులో వైఎస్సార్‌సీపీ నేత గోసు రాజగోపాల్‌రెడ్డి అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసును బనాయించారు.
నిన్న చిత్తూరు జిల్లా మదనపల్లి సీఐ, నేడు అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ సీఐపై ఈసీ కొరడా ఝుళిపించింది. అధికార తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఏకపక్షంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తోంది. ఈసీ చర్యలతో సదరు పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎవరిపై వేటు పడుతుందోనన్న ఆందోళన
వ్యక్తమవుతోంది.
ఎట్టకేలకు స్పందించిన ఈసీ
తాడిపత్రి రూరల్ సీఐ నారాయణరెడ్డి ఏకపక్ష వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి పలుమార్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు ఈసీ స్పందిస్తూ నారాయణరెడ్డిని బదిలీ చేసింది. ఈయన స్థానం లో తిరుపతి క్రైం బ్రాంచ్‌లో పనిచేస్తున్న శరత్‌చంద్రను నియమిస్తూ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment