న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆస్పత్రులు, పాఠశాలలు తమ హయాంలో వేగంగా అభివృద్ధి చేశామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాము ఎంతో కష్టపడి అభివృద్ధి చేసిన ఆస్పత్రులు, పాఠశాలలు మరింత అభివృద్ది చెందాలంటే ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) ప్రభుత్వాన్ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వేరే పార్టీ అధికారంలోకి వస్తే తాము సాధించిన అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. మరోసారి ఆప్ అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ మెరుగుపరచడానికి మరింత కృషి చేస్తామని అన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70 సీట్లకు గాను 67 సీట్లను సాధించి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రజల సంతోషం కోసం ఎంతో కృషి చేశానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు కూడా తనకే ఓటు వేయాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పెద్ద కుమారుడిలా సేవలందిస్తానని అన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని, ఉచిత విద్యుత్, త్రాగునీరు అందించామని తెలిపారు. ఇంకా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయని, 70 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పనులు కేవలం 5సంవత్సరాలలో పూర్తి చేయలేమని అన్నారు. పనులన్నీ పూర్తి కావాలంటే మరికొంత సమయం కావాలని అన్నారు. ఢిల్లీ ప్రజలు స్థానిక సమస్యలకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment