
హైదరాబాద్: రైతాంగ సమస్యలపై శుక్రవారం(23న) ‘చలో అసెంబ్లీ’నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. బుధవారం ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రూ.లక్షలోపు పంటరుణాలు మాఫీ చేస్తామన్న సీఎం కేసీఆర్ మాటలు నమ్మి అనేకమంది రైతులు బ్యాంకు రుణాలు కట్టలేదని, కానీ హామీ నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
రుణాలు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతంలోని 1,600 మందికిపైగా రైతులకు బ్యాంకులు నోటీసులు జారీ చేశాయన్నారు. రాష్ట్రంలో 80 వేల మంది రైతులు అప్పులఊబిలో చిక్కుకొని అల్లాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ‘నిమ్మకు నీరెత్తినట్లుగా’ వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతాంగానికి దాదాపు 500 కోట్లు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని, రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీ కింద కేంద్రం 3 శాతం జమ చేస్తే, రాష్ట్రం 4 శాతం ఇవ్వాల్సి ఉందన్నారు.
ప్రభుత్వ వాటా చెల్లించక పోవడంతో వడ్డీ పెరిగిపోయి దాదాపు 15 లక్షల మంది రైతులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఈ నెల 23న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, అధికార ప్రతినిధి రఘునందన్‌రావ్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment