టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: ప్రజాస్వామ్యం, ఫ్రీడం ఆఫ్ ప్రెస్ స్వాతంత్ర్యానంతరం మన దేశంలో తప్ప ఎక్కడా లేదు కానీ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అణచివేత మొదలైందని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాక్యానించారు. ఉత్తమ్ మాట్లాడుతూ..వరంగల్ సభలో సీఎం కేసీఆర్ చిల్లరగా మీడియాను 10 కిలోమీటర్ల లోతుకు తొక్కుతా అన్నాడని గుర్తు చేశారు. ఇప్పుడు మీడియాకు అవకాశం వచ్చిందని, కేసీఆర్ కుటుంబాన్ని 10 కిలోమీటర్ల లోతుకు తొక్కేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ మీడియా యాజమాన్యాలకు ఫోన్ చేసి వార్తలు ఇలా రావాలి అలా రావాలంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు.
గతంలో సీఎం, మంత్రులు ఎప్పుడైనా అలా చేశారా అని ప్రశ్నించారు. మమ్మల్ని కేసీఆర్ తిడితే బ్యానర్లు పెట్టారని, అదే తాము తిడితే మీడియా అసలు పట్టించుకోలేదని చెప్పారు. మీడియా సంస్థల యాజమాన్యాలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవుపలికారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కేసీఆర్ అందరినీ అవహేళన చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ నువ్వూ, నీ కుమారుడు, నీ బిడ్డనే తెలంగాణా వాళ్లా? మిగిలిన వాళ్లు కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఎవరిని అడిగి రూ.వందల కోట్లతో ఇళ్లు కట్టావు..ఖరీదైన కార్లలో తిరుగుతున్నావని సూటిగా అడిగారు. సోనియా గాంధీని విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదని అన్నారు. ఎన్నో త్యాగాలు చేసిన నెహ్రూ కుటుంబం మీ కంటే ఎంతో సాధాసీదాగా బతుకుతున్నారని చెప్పారు.
రాహుల్ గాంధీ 15 ఏళ్లుగా ఎంపీగా ఉన్నా ప్రధాని కాలేదు..ఇందిరా, రాజీవ్‌లు ఎలా చనిపోయారు తెలుసుగా..అలాంటి కుటుంబంపై కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని దుయ్యబట్టారు. ప్రజా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మండలస్థాయి రిపోర్టర్ నుంచి ప్రతి జర్నలిస్టుకు అన్నిరకాల మౌళిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీని బొంద పెట్టి ఘోరీ కట్టే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment