సాక్షి ప్రత్యేక ప్రతినిధి
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. ఫలితాలు వచ్చేందుకు మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు భవిష్యత్ పోటీదారు ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. ఎన్నికలు జరిగిన తీరు, ఫలితాల అంచనాల మేరకు.. అధికార పార్టీకి పోటీదారు స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టిపోటీ ఉన్నట్లు అర్థమవుతోంది. ఎగ్జిట్‌పోల్స్‌ను అధికారికంగా వెల్లడించనప్పటికీ 5–6 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ బాగా పుంజుకుందని, కాంగ్రెస్‌ను వెనక్కితోసి రెండో స్థానం కోసం పోటీ పడిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే నిజమైతే భవిష్యత్‌లో బీజేపీనే టీఆర్‌ఎస్‌కు పోటీదారుగా మారుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
శాసనసభ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నప్పటికీ.. లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి ప్రధాన ప్రతిపక్షాన్ని వెనక్కి నెట్టివేసిందని వస్తున్న వార్తలు కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడంలేదు. అదే నిజమైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, మెజారిటీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చామని, ఒకట్రెండు స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానాన్ని నిలబెట్టుకుంటుందనే ధీమా కూడా కొందరు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం తుదివిడత పోలింగ్ ముగిసిన అనంతరం వెల్లడయ్యే ఎగ్జిట్‌పోల్ ఫలితాల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, శ్రేణులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.
బీజేపీదీ అదే స్థితి..
ఈసారి ఎన్నికల్లో సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో తమ అభ్యర్థులు టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చారని, ఒకట్రెండు స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు దీటుగా తమకు ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. అదే జరిగి.. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రధాన ప్రతిపక్షం కానుందనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల నాటికే తెలంగాణలో ఎదగాలని బీజేపీ యత్నించినా సఫలం కాలేదని, ఫలితాలు సానుకూలంగా వస్తే ఈసారి పార్టీ అధిష్టానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెడుతుందంటున్నారు.
ఇన్నాళ్లూ కాంగ్రెస్‌కి అండగా ఉన్న నేతలకు గాలం వేస్తారని, వారిని పార్టీలోకి తీసుకోవడంతోపాటు మరిన్ని వ్యూహాలు అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో పాగా వేసేదిశగా ముందడుగులు పడతాయనే చర్చ సాగుతోంది. దీంతో రాష్ట్రంలో టీఆర్ ఎస్ రాజకీయ ప్రత్యర్థి ఎవరనేది మే 23న తేలనుంది. అయితే, కేంద్రంలో అధికారం దక్కకపోయినా, రాష్ట్రంలో కనీస స్థాయిలో ఓట్లు సాధించకపోయినా బీజేపీ కూడా రాష్ట్రంలో డీలా పడడం ఖాయమని రాజకీయ వర్గాలంటున్నాయి.
కాంగ్రెస్‌కు కీలకం
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్‌కు కీలకం కానున్నాయి. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ పార్టీ మనుగడను ఈ ఫలితాలు నిర్ణ యిస్తాయని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. మోదీ హవా మళ్లీ కొనసాగితే వచ్చే ఐదేళ్ల వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో పార్టీ మనుగడ కష్టమేననే అంచనాలున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యంతోపాటు సీఎల్పీ విలీనం దిశగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. లోక్‌సభ ఫలితాల్లో కంగుతింటే పార్టీ ఇప్పట్లో కోలుకునే పరి స్థితి ఉండదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జాతీయ స్థాయిలో చక్రం తిప్పే స్థాయిలో, రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా నిలబెట్టుకునే స్థాయిలో సీట్లు రాకపోయినా పార్టీ మను గడ కష్టమేనని చెబుతున్నారు. కొందరు నేతలు మాత్రం ధీమాగానే ఉన్నారు. నల్లగొండ, భువనగిరి, మల్కాజ్‌గిరి, ఖమ్మం, చేవెళ్ల, పెద్దపల్లి స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చామని అంటున్నారు. కానీ, అంచనాలు తలకిందులై టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేసి, బీజేపీ ఐదారు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో వస్తే మాత్రం తమ పని అయిపోయినట్లేనని వారు అంగీకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment