
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభ ముగిసింది. ఈ సభలో కేసీఆర్ ప్రసంగం ఆకట్టుకుంది. హైదరాబాద్ శివార్లలోని కొంగరకలాన్‌లో తలపెట్టిన ఈ సభకు లక్షలాదిగా టీఆర్‌ఆర్ కార్యకర్తలు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు సభ ప్రాంగణానికి చేరుకున్నాయి. జిల్లాల నుంచి వేలాది ట్రాక్టర్లలో సభకు కార్యకర్తలు తరలివచ్చారు. సుమారు లక్ష వాహనాల్లో 25 లక్షలమంది ప్రజలు సభకు హాజరైనట్టు అంచనా. ప్రగతి నివేదన సభ, కేబినెట్ భేటీకి సంబంధించిన అప్‌డేట్స్ ఇవి..
రాత్రి 7:30: ముగిసిన సీఎం కేసీఆర్ ప్రసంగం
సాయంత్రం 6:40: ఉపన్యాసం ప్రారంభించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు లైవ్ కోసం క్లిక్ చేయండి
సాయంత్రం 6.35: ఎన్నికల హామీలను 100శాతం అమలు చేశాం. కేసీఆర్ పరిపాలన వల్లే ఇది సాధ్యమైంది- కడియం శ్రీహరి
సాయంత్రం 6.30: తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అంకితం, మరో 10 ఏళ్ల కేసీఆర్ సీఎంగా ఉండాలి - కేశవరావు
సాయంత్రం 6.27: సీఎం కేసీఆర్ రాకతో ప్రగతి నివేదన సభ ప్రారంభమైంది. రవాణ శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కేసీఆర్ స్వాగతం పలుకుతూ సభనుద్దేశించి ప్రసంగించారు.
సాయంత్రం 6.23: ప్రగతి నివేదన సభా వేదికపైకి కేసీఆర్ చేరుకున్నారు. సభపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.
సాయంత్రం 6.15: సభాప్రాంగణాన్ని హెలికాప్టర్ నుంచి పరిశీలిస్తున్న కేసీఆర్
సాయంత్రం 6.10: సీఎం కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్‌లో కొంగరకలాన్‌కు చేరుకున్నారు.
సాయంత్రం 5.45: బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రగతి నివేదన సభకు బయల్దేరారు.
సాయంత్రం 4.57: కొంగర్‌కలాన్ ప్రగతి నివేదన సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పార్కింగ్ ప్లేస్ లేక సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి.
సాయంత్రం 4.15: ప్రగతి నివేదన సభ వేదికపై మంత్రులు, ఎంపీలు ఆసీనులయ్యారు. కళాకారులు వారి ఆటపాటలతో అలరిస్తున్నారు.
- సాయంత్రం 4.05: సీఎం కేసీఆర్ కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రగతినివేదన సభకు బయల్దేరనున్నారు. మరోవైపు మానిటరింగ్ రూమ్ నుంచి డీజీపీ మహేందర్‌రెడ్డి ట్రాఫిక్‌ను పరిశీలిస్తున్నారు. అన్ని రహదారుల్లో సాఫీగా వాహన రాకపోకలు సాగతున్నాయని తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఈ రోజు ట్రాక్టర్లను అనమతించమన్నారు. ట్రాఫిక్ దృష్ట్యా రేపు ఉదయం తర్వాతే అనుమతిస్తామన్నారు.
ప్రగతి భవన్ నుంచి ప్రగతి నివేదన సభకు..
- మధ్యాహ్నం 3.35: ప్రగతి భవన్ నుంచి రెండు హెలికాప్టర్లలో బయలు దేరిన మంత్రులు కొంగరకలాన్ సభకు చేరుకున్నారు.
- మధ్యాహ్నం 3.15: కేబినేట్ భేటి ముగియడంతో తెలంగాణ మంత్రులు ప్రగతి భవన్ నుంచి కొంగరకలాన్ సభకు బయల్దేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రెండు హెలికాప్టర్లలో సభకు వెళ్లారు.
ముగిసిన తెలంగాణ కేబినేట్ సమావేశం
- ముందుస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి భూములు, నిధులు కేటాయింపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే అర్చకుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచింది. రెడ్డి హాస్టల్ కోసం మరో 5 ఎకరాలు కేటాయించింది.
- మధ్యాహ్నం 2.20 : తెలంగాణ కేబినేట్ సమావేశం ముగిసింది. మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు.. లైవ్ కోసం క్లిక్ చేయండి
- మధ్యాహ్నం 1: తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం. కేబినెట్ సమావేశం తర్వాత మీడియా సమావేశం. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకుంటారని ఊహాగానాలు. కేబినెట్ భేటీ అనంతరం గవర్నర్ నరసింహాన్‌ను సీఎం కేసీఆర్ కలుస్తారని ప్రచారం. అనంతరం ప్రగతి నివేదన సభకు బయలుదేరనున్న సీఎం కేసీఆర్, మంత్రులు
- ఈ రోజు జరగబోయేది చివరి కేబినెట్ సమావేశం అని తాను అనుకోవడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్ ఏం చేసిందనేది చెప్పడమే సభ ఉద్దేశమని చెప్పారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశానికి తాను, మంత్రి మహేందర్‌రెడ్డి హాజరుకావడం లేదని, సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తుండటంతో తాము హాజరు కావడంలేదని చెప్పారు.
- మధ్యాహ్నం 12 గంటలు: ప్రగతి నివేదన సభలో శ్రీరాముడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చిత్రిస్తూ.. రూపొందించిన కటౌట్ అందరినీ ఆకట్టుకుంటోంది. రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ నాయకులు శ్రీరాముడి రూపంలో సీఎం కేసీఆర్ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
-
కొంగరకలాన్ సభకు జనజాతర కొనసాగుతున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి వందలాది వాహనాల్లో బయలుదేరారని, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 4.50 లక్షల మంది సభకు వస్తున్నారని మంత్రి తెలిపారు.
ఉదయం అప్‌డేట్స్..
సభా వేదిక, మైదానంతోపాటు సభకు దారితీసే ఔటర్ రింగ్‌రోడ్డు గులాబీ జెండాలతో రెపరెపలాడుతోంది. సభ కోసం భారీ వేదికను నిర్మించారు. 100 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో పటిష్టంగా నిర్మించిన వేదికపై 300 మంది ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లకు వేదికపై కూర్చునే అవకాశముంది. భారీ వర్షం వచ్చినా వేదికపై ఉన్న వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రూఫ్‌ను నిర్మించారు. వేదిక పరిసరాల్లో కంకర, సిమెంటుతో రోడ్డు వేశారు. దూరప్రాంతాల నుంచి వస్తున్న టీఆర్‌ఎస్ శ్రేణుల ట్రాక్టర్లలో చాలా మటుకు శనివారం సాయంత్రానికే సభా మైదానానికి చేరుకున్నాయి. అయితే ట్రాఫిక్ జామ్‌ను నివారించేందుకు శనివారం అర్ధరాత్రి వరకే ట్రాక్టర్లను అనుమతించాలని పోలీసులు నిర్ణయించారు.
హెలికాప్టర్‌లో సభాస్థలికి చేరుకోనున్న కేసీఆర్...
ప్రగతి నివేదన సభకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం 5.30 గంటలకు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే సభకు వచ్చే జనం, వాతావరణం వంటి వాటితో ఈ షెడ్యూల్‌లో మార్పులు ఉండే అవకాశం ఉందంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం ముగియనుంది. ఆ తరువాత సభాస్థలికి కేసీఆర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు అన్ని ప్రాంతాల నుంచి సభా మైదానానికి ప్రజలు చేరుకుంటారు. 3 గంటల ప్రాంతంలో సాంస్కతిక కార్యక్రమాలు, ప్రగతిని వివరించే పాటలు, కళారూపాల ప్రదర్శన ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పార్టీకి చెందిన ముఖ్య నేతల ప్రసంగాలు ప్రారంభమవుతాయి. కొందరు ముఖ్యుల ప్రసంగాల మధ్యలోనే పాటలు, సాంస్కృతిక కళారూపాల ప్రదర్శన జరగనుంది. కేసీఆర్ సభకు చేరుకున్నాక ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ ప్రసంగాలు ఉండే అవకాశముందని పార్టీ ముఖ్యులు వెల్లడించారు.
సిద్ధమైన కేసీఆర్ ప్రసంగం...
ప్రగతి నివేదన సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిన సందేశంపై కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఫాంహౌస్‌లో దీనికి తుది మెరుగులు చేశారు. కొందరు ముఖ్య నేతలు, అధికారులు, సలహాదారులతో కలసి ఈ సభ ద్వారా ప్రజలకు నివేదించాల్సిన ముఖ్య అంశాలపై కసరత్తు చేపట్టారు. 13 ఏళ్ల ఉద్యమకాలం, రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం, చేసిన త్యాగాల నుంచి ప్రారంభించి వర్తమాన పరిస్థితుల దాకా అన్ని విషయాలపై సంక్షిప్తంగా మాట్లాడనున్నారు.
రుణమాఫీ నుంచి రైతుబంధు దాకా...
పంట రుణాల మాఫీ నుంచి ప్రస్తుతం అమలు చేస్తున్న రైతుబంధు దాకా రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను కేసీఆర్ వివరించనున్నారు. రుణమాఫీ, వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్, సబ్సిడీపై యంత్రాల పంపిణీ, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకం దాకా అన్ని అంశాలనూ వివరించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు విద్యను అందించడానికి రెసిడెన్షియల్ పాఠశాలలు, ఉద్యోగాల భర్తీ, యువతకు ఉపాధి కల్పన కోసం తీసుకున్న చర్యలను చెప్పనున్నారు. గ్రామాల్లోని వృత్తుల పరిరక్షణ కోసం ఉచితంగా చేప పిల్లలు, గొర్రెల పంపిణీ పథకాలను గుర్తుచేయనున్నారు. బాలింతలు, శిశువుల కోసం అందిస్తున్న కేసీఆర్ కిట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ఆర్థిక సాయం, ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్, కంటి వెలుగు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటాన్ని వివరించనున్నారు.
ప్రధానంగా సాగునీటిని అందించడానికి పూర్తి చేస్తున్న కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను, ఇంటింటికీ తాగునీటిని అందించడానికి చేపట్టిన మిషన్ భగీరథను, చిన్ననీటి వనరులను పరిరక్షించడానికి అమలు చేసిన మిషన్ కాకతీయ వంటి పథకాలు, వాటి ద్వారా పొందిన ఫలితాలను చెప్పనున్నారు. ఆసరా పింఛన్లు, ఉచిత బియ్యం, విద్యార్థులకు సన్న బియ్యం, అమరుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం, పేదలకు పట్టాలు, కిందిస్థాయి ఉద్యోగులకు బీమా, ఆత్మగౌరవ భవనాలు, జీతాల పెంపు, వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలు, పారిశ్రామిక విధానం వంటి వాటిపై కేసీఆర్ సంక్షిప్తంగా వివరించనున్నారు.







Comments
Please login to add a commentAdd a comment