టీటీడీపీ వాషవుట్‌! | TTDP Is Being Washout | Sakshi
Sakshi News home page

టీటీడీపీ వాషవుట్‌!

Published Thu, Aug 15 2019 3:30 AM | Last Updated on Thu, Aug 15 2019 4:33 AM

TTDP Is Being Washout - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతోంది. రాష్ట్రంలో దాదాపు అడుగంటిన ఆ పార్టీలో మిగిలిపోయిన నియోజకవర్గ, మండలస్థాయి నేతలంతా బీజేపీ బాటపడుతున్నారు. బీజేపీ అధిష్టానం ప్రత్యేక ఆపరేషన్‌తో రాష్ట్రంలో నలుగురైదుగురు ముఖ్య నేతలు మినహా అందరూ త్వరలోనే కమలదళంలో చేరనున్నారు. ఈ మేరకు నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లా ల్లోని పార్టీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు ప్రకటించగా, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో మిగిలిన నేతలు కూడా నేడో, రేపో పార్టీని వీడనున్నారు. 2023 నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న ఆకాంక్షతో బీజేపీ అధిష్టానం టీడీపీ నేతలపై దృష్టిపెట్టి ఆ పార్టీని దాదాపు వాషవుట్‌ చేస్తుండడం గమనార్హం. 

మునిగిపోయిన నావలో మురవలేం 
తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకమైపోయింది. ఐదారేళ్లుగా జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని నానాటికీ కుదేలు చేశాయి. దీంతో పార్టీలో ని మెజారిటీ నేతలు వేరేదార్లు వెతుక్కుంటున్నా రు. కొందరు మాత్రం పార్టీపై ఉన్న అభిమానంతో పాటు ఏ పార్టీలోకి వెళ్లే అవకాశం లేక పచ్చజెండా నే పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు బీజేపీ రూపంలో వారికి ప్రత్యామ్నాయం కనిపిస్తుండడంతో నిండా మునిగిపోయిన నావలో ఇంకా మురవలేమంటూ ఆ పార్టీ బాట పడుతున్నారు. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఇంచార్జ్‌లు, ముఖ్యనేతలు సమావేశమై తాము టీడీపీకి రాం రాం చెప్పి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. పార్టీ సభ్యత్వం, పదవులకు రాజీ నామా చేస్తున్నామని వెల్లడించారు.

వరంగల్, ఖమ్మం జిల్లా నేతలు కూడా వీడ్కోలు తప్పదనే సంకేతాలిచ్చారు. రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి కూడా తాను బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో మిగిలిపోయిన నేతలతో కూడా బీజేపీ నాయకత్వం సంప్రదింపులు జరుపుతుండటంతో వారు కూడా నేడో, రేపో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. వీరంతా ఈనెల18న నాంపల్లిలో జరిగే సభలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, దేవేందర్‌గౌడ్‌ వంటి నలుగురైదుగురు నేతలు మినహా టీటీడీపీ నేతలంతా బీజేపీలో కలిసిపోతుండటం, పార్టీ అధినేత చంద్రబాబు పార్టీని పట్టించుకోకపోవడంతో ఇక రాష్ట్రంలో టీడీపీ కనుమరుగైపోతుందనే చర్చ జరుగుతోంది. 

కాంగ్రెస్‌ నేతలకూ గాలం! 
జాతీయాధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలో జరుగుతున్న ఆపరేషన్‌తో గట్టి పునాదులు వేసుకోవాలనుకుంటున్న బీజేపీ.. కాంగ్రెస్‌ నేతలకూ గాలమేస్తోంది. బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీలోకి వెళ్లాలను కుంటున్న వారి జాబితా చాంతాడంత ఉంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో పాటు ఇద్దరు మాజీ ఎంపీలు, 10 మందికి పైగా మాజీ ఎమ్మెల్యేలతో తాము చర్చలు జరుపుతున్నామని, వారంతా పార్టీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమవుతోందని బీజేపీ నేతలు చెపుతున్నారు. అయితే, అదంతా బీజేపీ ప్రచారం మాత్రమేనని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. కాగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఒకరు బీజేపీ అధిష్టానంతో పూర్తిస్థాయిలో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ను ఆయన కలిశారని, ఇటీవలే హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తోనూ ఆయన భేటీ అయ్యారని తెలుస్తోంది. ఆయన దాదాపు బీజేపీలోకి వెళ్లేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని, అమిత్‌షా పర్యటనలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.

బాబు అనుమతితోనేనా?
టీటీడీపీ నేతలు బీజేపీలోకి వెళుతుండటం వెనుక చంద్రబాబు వ్యూహముందనే చర్చ జరుగుతోంది. ఆయన అనుమతితోనే కమ లతీర్థం పుచ్చుకుంటున్నారని, తనకెలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు తెలంగాణ పార్టీని చంద్రబాబు పణంగా పెడుతున్నార ని ‘తమ్ముళ్లు’బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బాబు సూచనల మేరకు ఆయన వ్యాపారభాగస్వామి, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు టీడీపీలోకి వెళుతున్నారంటున్నారు. ఏపీటీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లు కూడా బాబు కనుసన్నల్లో కాషాయ కండువా కప్పుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement