గాంధీనగర్ : రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గుజరాత్‌లో మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్, జీతుభాయ్ చౌదరీలు తమ రాజీనామా పత్రాలను సమర్పించారని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది తెలిపారు. ఎవరి ప్రమేయం లేకుండా తమ సొంత నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలపడంలో రాజీనామాలకు ఆమోదం తెలిపానని స్పీకర్ ప్రకటించారు. కాగా ఈ ఏడాది మార్చిలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక గుజరాత్‌లోని 4 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష కాంగ్రెస్‌కు స్థానాలు దక్కకుండా చేసేందుకు అధికార బీజేపీ ఎమ్మెల్యేలపై బేరసారాలకు దిగుతోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. (24 రాజ్యసభ సీట్లకు 19న ఎన్నిక)
ఇక కాంగ్రెస్ కీలకంగా భావిస్తున్న రాజ్యసభ ఎన్నికల ముందు వరుసగా ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకునేందుకు అధికార బీజేపీ కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 73నుంచి 66కి చేరింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 సభ్యులకు గాను బీజేపీకి 103 మంది సభ్యుల మద్దతుంది. అయితే ఎన్నికలు జరిగే నాలుగు స్థానాలను రెండు పార్టీల సంఖ్యా బలాలను బట్టి కాంగ్రెస్, బీజేపీ చెరి రెండు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. అయితే మూడో స్థానాన్ని కూడా సొంతం చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. (ఆ పార్టీ కోసం పని చేయను: పీకే)
ఈ క్రమంలోనే 111 మంది సభ్యుల మద్దతును కూడగట్టుకునే పనిలో ఆ రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైంది. ఎన్నికల ప్రకటన వెలువడిన కొద్దిరోజుల్లోనే విపక్ష సభ్యులు రాజీనామా చేయడం వెనుక కాషాయ నేతల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రెండు స్థానాలను దక్కించుకోవాలంటే విపక్ష కాంగ్రెస్‌కు 74 మంది సభ్యుల మద్దతు అవసరం కానుంది. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాతో కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకు మరికొంత సమయం ఉన్నందును వారిని తిరిగి తమవైపుకు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. మొత్తానికి రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్‌కు లేని కష్టాలను తెచ్చిపెడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment