
వారసుడు ఉదయనిధి స్టాలిన్ రాజకీయాలపై అధిక దృష్టి పెట్టేందుకు నిర్ణయించారు. తండ్రిబాటలో ఒక్కో మెట్టు ఎక్కడం లక్ష్యంగా రాజకీయ పయానానికి తగ్గ కార్యా చరణలో నిమగ్నమయ్యారు. మనకు మనమే..అంటూ స్టాలిన్ గతంలో ప్రజల్లోకి వెళ్లగా... స్టాలిన్‌ను సీఎం చేద్దాం...అన్న నినాదంతో ఈ వారసుడు ప్రజాపయానికి కసరత్తులు చేపట్టారు.
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత దివంగత కరుణానిధి వారసుడిగా ఎంకే స్టాలిన్ మొదటి నుంచి సాగించిన రాజకీయ పయనం గురించి తెలిసిందే. పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఆయన ఎదిగి ఇప్పుడు పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టి ఉన్నారు. ప్రజల్లో మమేకం అయ్యే విధంగా గతంలో ఆయన రచ్చబండ , వీధి సభలు అంటూ ముందుకు సాగడమే కాదు...మనకు..మనమే నినాదంలో రాష్ట్రంలో సుడిగాలి పర్యటన కూడా చేశారు. గ్రామాల్ని అనుసంధానిస్తూ పాదయాత్ర రూపంలో కొందరు దూరం, రోడ్ షోల రూపంలో మరి కొంత దూరం, సైకిల్ తొక్కుతూ ఇంకొంత దూరం అన్నట్టుగా పర్యటనల్ని సాగించి ప్రజల దృష్టిలో పడ్డారు. కరుణానిధి మరణం తదుపరి డీఎంకే అధ్యక్ష పగ్గాలు చేపట్టిన స్టాలిన్ సీఎం కుర్చీని అధిరోహించాలన్న కాంక్షతో ముందుకు సాగుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్సాల్చి వచ్చిందంటే..!. ఇదే తరహాలో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ఆయన వారసుడు ఉదయనిధి సిద్ధం అవుతుండడమే.
వారసుడి రాజకీయ పయనం..
ఉదయనిధి స్టాలిన్ తొలుత ఓ నిర్మాతగా రాష్ట్ర ప్రజలకు పరిచయం. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌లో అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్ని తెరకెక్కించారు. అనంతరం తానే స్టార్ అవతారం ఎత్తారు. హీరోగా పలు చిత్రాల్లో మెప్పించారు. తన కంటూ అభిమాన సమూహాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాదు, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తన మిత్రులకు పార్టీ సీట్లు ఇప్పించుకుని, వారి గెలుపు కోసం ఆ నియోజకవర్గాల్లో శ్రమించి మెప్పు పొందారు. స్టాలిన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టినానంతరం డీఎంకే బలోపేతానికి తన వంతు కృషి చేయడం మొదలెట్టారు. డీఎంకే పత్రిక మురసోలిలో క్రియా శీలక పాత్ర పోషించడమే కాదు, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఉదయ నిధి ఆకర్షించారు. స్టాలిన్ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం సాగిస్తే, తాను సైతం అంటూ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. ఉదయ నిధి ప్రసంగాలు, ఆయన వాక్ చాతుర్యం, సమయానుగుణంగా, సందర్భానుగుణంగా చేసిన వ్యాఖ్యలు తూటాలే ప్రజల్ని ఆకర్షించాయి.
లోక్ సభ ఎన్నికల డీఎంకే క్లీన్ స్వీప్ అన్నట్టుగా ముందుకు సాగడంతో పార్టీలో ఉదయనిధికి ఏదేని పదవి కట్టబెట్ట వచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. ప్రధానంగా యువజన విభాగం కార్యదర్శి పదవి ఆయన్ను వరించడం ఖాయం అన్నట్టుగా మీడియాల్లో కథనాలు హోరెత్తాయి.అయితే, వారసుడ్ని అభినందించిన స్టాలిన్, ఎలాంటి పదవి అన్నది మాత్రం కట్ట బెట్ట లేదు. తన వారసుడిగా పదవి కట్టబెట్టిన పక్షంలో కుటుంబ రాజకీయాలూ అంటూ విమర్శలు రావడమే కాదు, పార్టీలోని సీనియర్ల తమ వారసులకు అంటే తమ వారసులకు పదవులు అన్న నినాదం అందుకోవచ్చన్న భావనతో ఉదయ నిధిని స్టాలిన్ పక్కన పెట్టినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటూ వచ్చాయి.
అదే సమయంలో తాను పార్టీకి కార్యకర్తను మాత్రమేనని, పార్టీ కోసం నిరంతరం సేవల్ని అందిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతానన్నట్టుగా ఇటీవల ఓ వేదిక మీద ఉదయ నిధి ప్రకటించడం అందర్నీ ఆలోచనలో పడేశాయి.అంతే కాదు, కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చే రీతిలో డీఎంకే బలం ఏమిటో, స్టాలిన్ ప్రభజనం అంటే ఎలా ఉండబోతుందో ముందుగానే చాటే దిశలో ఉదయ నిధి ప్రసంగాలు హోరెత్తాయి. ఈ పరిస్థితుల్లో తండ్రి బాటలో ముందుగా ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు ఉదయ నిధి కూడా సిద్ధం కావడం గమనార్హం. గతంలో తన తండ్రి స్టాలిన్ మనకు..మనమే అన్న నినాదాన్ని అందుకుంటే, తాజాగా స్టాలిన్‌ను సీఎం చేద్దాం..తరలిరండి...అన్న నినాదంతో ఈ వారసుడు ప్రజాయాత్రకు సిద్ధం అవుతుండడం విశేషం. పాదయాత్ర రూపంలో సాగే ఈ ప్రజా పయనం రూట్ మ్యాప్, షెడ్యూల్ త్వరలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలాగే, డీఎంకేకు పట్టుకొమ్మగా ఉన్న యువజన విభాగాన్ని మరింత పటిష్టవంతం చేయడం లక్ష్యంగానే కాదు, తన భవిష్యత్తుకు బాట వేసుకునే రీతిలో సినిమాల్ని కాస్త పక్కన పెట్టి, ప్రజాయాత్రకు ఉదయ నిధి కసరత్తులు చేస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చజోరందుకుంది. ఆనాడు కరుణానిధికి పక్కబలంగా స్టాలిన్ ఏవిధంగా ముందుకు సాగారో, అదే తరహాలో తన తండ్రి స్టాలిన్‌కు ప్రజాబలాన్ని మరింతగా సమకూర్చేందుకు, సీఎం కుర్చీలో కూర్చొబెట్టేందుకు తాను సైతం అన్నట్టుగా ఈ వారసుడు ముందుకు పరుగులు తీస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment