సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ బిల్లు -2014ను పార్లమెంటు భయంకరంగా ఉన్న సమయంలో పాస్ చేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తలుపులు మూసేసి బిల్లును ఆమోదించిన రోజున బీజేపీ నేతలూ సభలో ఉన్నారని, ప్రస్తుత స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా అంతా చూశారని చెప్పారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు ముఖం చాటేస్తోందని అన్నారు.
గురువారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవిశ్వాసం తీర్మానం నిలబడదని తెలిసినా బీజేపీ ఎందుకు చర్చకు జరగనివ్వడం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. అవిశ్వాసంపై చర్చ జరిగేలా స్పీకర్ చొరవ తీసుకోవాలని హితవు పలికారు. లోక్‌సభ వెల్‌లోకి అన్నాడీఎంకే ఎంపీలు దూసుకెళ్తే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో స్పీకర్‌కు తెలుసునని అన్నారు.
గతంలో పలుమార్లు సభ్యులు వెల్‌లోకి వెళ్తే సస్పెండ్ చేసిన సంఘటనలు ఉన్నాయన్నారు. ప్రధాని మోదీ చిన్న సైగ చేస్తే లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుపడుతున్న అన్నాడీఎంకే ఎంపీలు పక్కకు పోతారని వ్యాఖ్యానించారు. అవిశ్వాసంపై చర్చ జరగడం బీజేపీకి ఇష్టం లేదని అన్నారు. అందుకే తాను ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ బిల్లు -2014ను తలుపులు వేసి పాస్ చేశారని కోర్టులో కేసు వేసినట్లు చెప్పారు.
చంద్రబాబు కూడా అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నారని.. తాను వేసిన పిటిషన్‌కు బాబు కౌంటర్ వేస్తే బెటర్ అని సూచించారు. పార్టీల రాజకీయాలను పక్కన బెట్టి అన్ని పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విషయంలో చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగి రాష్ట్రాన్ని కాపాడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment