
ముంబై నార్త్ లోక్‌సభ స్థానానికి గ్లామర్ డాల్ ఊర్మిళా మతోండ్కర్ పేరుని కాంగ్రెస్ ఖరారు చేసిన తక్షణమే బాలీవుడ్ అందాల తార, రాజకీయవేత్త ఆహార్యంలోకి మారిపోయారు. చిట్టిపొట్టి గౌనుల్లో నుంచి ఆకర్షణీయమైన, సౌకర్యవంతమైన చీరలూ, పెద్దరికాన్ని తెచ్చిపెట్టే వదులైన దుస్తులు ధరించి ప్రచారం సాగిస్తున్నారు. దుమ్మూ, ధూళీ మధ్య మండుటెండల్లో ఎన్నికల ప్రచార వేళ బహుశా ఈ దుస్తులు మతోండ్కర్ సౌకర్యం రీత్యా ఎంచుకొని ఉంటారు. ఇప్పటికే కొన్ని రోజులుగా సామాన్య, మధ్య తరగతి ప్రజల సమస్యలపై పరిణతి చెందిన రాజకీయవేత్త తరహాలో వ్యాఖ్యానాలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు ఊర్మిళ. ఆమెలోని పఠానాసక్తీ, సామాజిక సమస్యలపై ఆసక్తీ ఆమె ఉపన్యాసాల్లోనూ ప్రతిబింబిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఒక సాధారణ మధ్యతరగతి ప్రభుత్వోద్యోగ కుటుంబం నుంచి వచ్చి, చిత్ర పరిశ్రమలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న ఊర్మిళ బీజేపీ పునాదులు బలంగా ఉన్న ముంబై నార్త్‌లో రాణిస్తారా అన్నది ఇప్పుడు అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు, ఎస్‌ఏ.డాంగే, వీకే కృష్ణమీనన్ లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంపై ఈ రెండు ప్రధాన పార్టీలు గంపెడాశలు పెట్టుకున్నాయి.
మాటల మరాఠీ..
ముంబై నార్త్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇటీవల చుట్టుముట్టిన ఫొటోగ్రాఫర్లూ, మీడియా ప్రతినిధుల మధ్య ఏ జంకూ గొంకూ లేకుండా అశోక్ సుత్రాలే తదితర కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్మికుల సమక్షంలో మీడియా అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పి మెప్పించారు ఊర్మిళ. ఇరవయ్యవ శతాబ్దపు సంస్కరణవాది మహారాష్ట్రకు చెందిన పాండురంగ సదాశివ్ సేన్ గురూజీ బోధనలను అనర్గళంగా వల్లె వేస్తోన్న ఊర్మిళను స్థానిక మరాఠీలూ, భారతీయ జనతా పార్టీ సానుభూతిపరులు చెవులు రిక్కించి వింటూంటే స్థానికులను ఆమె ఉపన్యాసాలు సమ్మోహన పరుస్తున్నాయి. మొహంపై చిరునవ్వుని చెదరనివ్వకుండా ఊర్మిళ ప్రస్తుత సమాజంలో విస్తృతంగా చర్చ జరుగుతోన్న మతం, దేశభక్తీ, వ్యక్తిగత స్వేచ్ఛ తదితరాంశాలపై ప్రత్యర్థి వర్గంపై ప్రశ్నల వర్షం కురిపిస్తుండటం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది.
మరాఠీ ఓట్లపైనే ఆశ
ముంబై నార్త్‌లో మొత్తం 17.8 లక్షల మంది ఓటర్లుంటే అందులో అత్యధికంగా 40 శాతం మంది గుజరాతీయులు. ఆ తరువాత స్థానంలో మహారాష్ట్రియన్లు, ఉత్తరభారతీయులు, ముస్లిం మైనారిటీలూ, క్రిస్టియన్లూ, జైన సామాజిక వర్గానికి చెందిన వారూ ఉన్నారు. ఊర్మిళ ప్రవేశంతో ఈ లోక్‌సభ స్థానంలో అత్యధికంగా ఉన్న మరాఠీల ఓట్లను ఈమె ఆకట్టుకోగలరని ఊర్మిళ ప్రచార ప్రణాళిక రచిస్తోన్న జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు గన్‌శ్యాం తెలిపారు. అయితే స్థానిక ప్రజలకు సుపరిచితుడూ, గుజరాతీలో అనర్గళంగా మాట్లాడే బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి ముందు ఊర్మిళ ఛరిష్మా ఏమాత్రం పనిచేయదని బీజేపీ వాదిస్తోంది.
గెలుపు కల్ల అంటోన్న బీజేపీ
ఊర్మిళ అంశాన్ని పక్కనపెడితే మోదీ వేవ్ విస్తృతంగా వీచిన 2014లో ఎన్నికల్లో శెట్టి విన్నింగ్ మార్జిన్ 4.47 లక్షల ఓట్లు. అది 2019 ఎన్నికల్లో 5.50 లక్షలకు మించవచ్చునని ముంబై బీజేపీ ఉపాధ్యక్షుడూ, ముంబై నార్త్ ఇన్‌చార్జ్, ప్రముఖ లాయర్ జెపి.మిశ్రా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ పార్లమెంటు స్థానంలో బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలున్నారు. శివసేనకి ఒకరు, కాంగ్రెస్‌కి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక్కడ మొత్తం 42 మున్సిపల్ కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీ శివసేనలకి కలిసి 39 వచ్చాయి. అందుకే ఇక్కడ మతోంద్కర్ గెలుపు ప్రసక్తే లేదని బీజేపీ కొట్టిపారేస్తోంది. అయితే స్థానికంగా బీజేపీకి పట్టున్న ఈ స్థానంలో ఊర్మిళ పోటీ తమని విజయతీరాలకు చేరుస్తుందన్న ధీమాని వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. మొత్తం మీద బీజేపీ– కాంగ్రెస్ రెండూ ఈ స్థానంపై ఆశలు పెట్టుకొన్నాయి.
పుస్తక ప్రియురాలు
బాలీవుడ్ సినీతార ఊర్మిళ మతోండ్కర్ సింధుదుర్గ్‌లో శ్రీకాంత్, సునీత దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి శ్రీకాంత్ రిటైర్డ్ బ్యాంకు అధికారి. తల్లి సునీత విశ్రాంత ప్రభుత్వోద్యోగి. ఊర్మిళ శతాబ్దాల చరిత్ర కలిగిన దాదర్‌లోని కింగ్ జార్జ్ హైస్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. ఆ తరువాత రూపరేల్ కాలేజ్‌లో డిగ్రీ చేరినప్పటికీ ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేయకుండానే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, సినిమాల్లో బిజీ అయిపోయారు. అనతి కాలంలోనే చిత్రపరిశ్రమలో గుర్తింపు పొందిన ఊర్మిళకు.. ‘రంగీలా’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. సినీ ప్రయాణం సక్సెస్‌ఫుల్‌గా సాగుతుండగానే కశ్మీరీ వ్యాపారి ఎంఏ.మిర్‌ని పెళ్లి చేసుకున్నారు. ముంబైలో నివసిస్తోన్న ఊర్మిళ సోదరి మమత.ఎ.భాలేకర్ మాజీ సినీ నటి. ఆ తరువాత న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఊర్మిళ అన్న రిటైర్డ్ సైనికోద్యోగి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సామాజిక సమస్యల గురించి నిత్యం ఆలోచించే ఊర్మిళ పుస్తక ప్రియురాలు. దాదాపు ప్రముఖ సాహిత్యాన్నంతా చదివిన అనుభవం, సదాశివ్ సేన్ గురూజీ బోధనలు ఆమెను బాగా ప్రభావితం చేశాయి. సామాజిక సమస్యలపై అవగాహన కలిగిన ఊర్మిళ సినిమాల్లో నటించినా, సామాజిక కార్యకర్తగా ఉన్నా, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా నిబద్ధతతో పనిచేస్తారని ఆమె తండ్రి శ్రీకాంత్ కితాబునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment