ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడం హాస్యాస్పద విషయం అని కాంగ్రెస్ నాయకురాలు, ముంబై నార్త్ ఎంపీ అభ్యర్థి ఊర్మిళ మటోంద్కర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. మోదీ బయోపిక్ వంటి కామెడీ సినిమాలు తీసే బదులు, ఆయన అబద్ధపు హామీలపై సినిమా నిర్మిస్తే బాగుంటుందని సూచించారు. ‘ ఎప్పుడూ తన 56 ఇంచుల ఛాతీ గురించి మాట్లాడుతూ పబ్బం గడిపే మోదీ జీవిత చరిత్రను తెరకెక్కించడం కంటే పెద్ద జోక్ ఇంకేమీ ఉండదు. నిజానికి అందుకు ఆయన అర్హుడు కూడా కాదు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని అటువంటి వ్యక్తి గురించి సినిమా తీస్తే ప్రజాస్వామ్యాన్ని, పేదరికాన్ని, భారతదేశ లక్షణం భిన్నత్వంలో ఏకత్వాన్ని అపహాస్యం చేసినట్లే’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
కాగా నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రలో ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దేశంలో లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజకీయ నాయకుల బయోపిక్‌లను విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్‌కు బ్రేక్ పడింది. ఇక ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన సినీ నటి ఊర్మిళ ముంబై నార్త్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తన ప్రత్యర్థి గోపాల్ శెట్టి(బీజేపీ), నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శలు చేస్తూ దూకుడు పెంచిన ఊర్మిళ.. ఇటీవల తన సభలో గందరగోళం సృష్టించిన ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ కార్యకర్తల కారణంగా తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని పోలీసులను ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment