సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ వాడివేడి విమర్శలకు పదును పెడుతున్నాయి. మోదీ కాంగ్రెస్‌ను ఎండగడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే, ప్రధాని లోపభూయిష్ట విధానాలతో దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. దేశంలో అసహనం పెరిగిపోతుండటం పట్ల నరేంద్ర మోదీ సర్కార్ తీరును బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళా మటోండ్కర్ తప్పుపట్టారు.
మోదీ వ్యక్తిగతంగా మంచి వ్యక్తే అయినా ఆయన విధానాలు సరైనవి కావని ధ్వజమెత్తారు. తాను గాంధీ, నెహ్రూల గురించి ఎంతో విన్నానని, తమ కుటుంబం కాంగ్రెస్ సిద్ధాంతాలను అనుసరిస్తుందని ఆ పార్టీలో చేరికపై వ్యాఖ్యానించారు. భారత్ ప్రజాస్వామిక దేశమని, ఇక్కడి ప్రజలు తమకు నచ్చినట్టు మాట్లాడేందుకు, ఇష్టమైన ఆహారాన్ని తీసుకునేందుకు స్వేచ్ఛ ఉందని చెప్పుకొచ్చారు.
కానీ దేశంలో ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉందన్నారు.మతం ప్రాతిపదికన ప్రజల మధ్య విభజన రేఖలు గీశారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రజల్లో తీవ్ర ద్వేషభావం నెలకొంది..మతం పేరుతో ప్రజలు ఒకరిని ఒకరు చంపుకుంటున్నా’రని వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్‌లో ప్రజలు సంతోషంగా లేరు..ఆయన తప్పుడు వాగ్ధానాలు చేస్తున్నారని, దేశమంతటా నిరుద్యోగం తాండవిస్తోందని ధ్వజమెత్తారు. కాగా తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో అనే దానిపై తనకు ఇంకా స్పష్టత లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment