బాలీవుడ్ నటి ఊర్మిల మతోండ్కర్
సాక్షి, ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఊర్మిల మతోండ్కర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ముంబై లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలవడం ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉత్తర ముంబై సీటు ఊర్మిలకు దక్కినట్టుగా తెలుస్తోంది. దీనిపై స్పందించడానికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. కాంగ్రెస్ అధిష్టానం ఊర్మిల అభ్యర్థిత్వం గురించి సీరియస్‌గా ఆలోచిస్తోందని, దాదాపుగా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఖాయమని వినిపిస్తోంది. ముంబైలోని ఆరు ఎంపీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న ఎన్నికలు జరుగనున్నాయి. ఒకవేళ ఊర్మిలకు ఎంపీ సీటు దక్కితే, సిట్టింగ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోపాల్ షెట్టిని ఆమె ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గతంలో బాలీవుడ్ దిగ్గజం సునీల్ దత్ 5 సార్లు గెలుపొందారు.
మరాఠీ చిత్రం జకూల్ (1980)తో తన సినీ కెరీర్‌ను ఆరంభించిన ఊర్మిల మతోండ్కర్ (45), శశి కపూర్ చిత్రం కల్‌యుగ్ (1981)తో బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. బాలనటిగా ఈ రెండు చిత్రాల్లో కనబర్చిన నటనకు మెచ్చి.. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ మాసూమ్ (1983) సినిమాలో ఊర్మిలకు అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో నటనకు గాను ఆమెకు చాలా ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత హీరోయిన్‌గా బాలీవుడ్‌ను షేక్ చేసింది ఊర్మిల. ఆమె నటించిన రంగీలా, ఇండియన్, దావూద్, సత్య, భూత్, మైనే గాంధీ కో నహీ మారా, స్పీడ్‌తో పాటు ప్రాంతీయ భాషా చిత్రాలు ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment