ముంబై : తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని ముంబై నార్త్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఊర్మిళ మటోంద్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తనకు రక్షణ కల్పించాల్సిందిగా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊర్మిళ సోమవారం.. తన నియోజకవర్గంలోని బోరివలీ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రసంగించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కొంతమంది బీజేపీ కార్యకర్తలు ‘మోదీ మోదీ’ అంటూ నినాదాలు చేస్తూ ఆటంకం కలిగించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో కొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీ తమ కార్యకర్తలను భయాందోళనకు గురిచేస్తున్నారని, మహిళా కార్యకర్తల పట్ల అవమానకరంగా వ్యవహరించారంటూ ఊర్మిళ పోలీసులను ఆశ్రయించారు.
ఈ విషయం గురించి ఊర్మిళ మీడియాతో మాట్లాడుతూ.. ‘ మేము ప్రశాంతంగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో 15 నుంచి 29 మంది వచ్చి మాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ సంయమనంతో వ్యవహరించాలని మా కార్యకర్తలకు సూచించాను. కానీ కాసేపటి తర్వాత వల్గర్‌గా డ్యాన్సులు చేస్తూ, అసభ్యంగా మాట్లాడుతూ రెచ్చగొట్టారు. ఆ సమయంలో నా చుట్టూ ఉన్న మహిళా కార్యకర్తల మీద దాడి చేస్తూ అభ్యంతకరంగా వ్యవహరించారు. మమ్మల్ని భయపెట్టేందుకు దిగజారుడు చర్యలకు పాల్పడ్డారు. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో వారు మరింత హింసకు పాల్పడే అవకాశం ఉంది. నా ప్రాణానికి కూడా ప్రమాదం పొంచి ఉంది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని పేర్కొన్నారు. కాగా ఊర్మిళకు పోటీగా ముంబై నార్త్ నుంచి బీజేపీ తరఫున గోపాల్ శెట్టి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment