సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లిపోవడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయని, 11న ఫలితాలు వస్తే.. 12న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. డిసెంబర్ 12 తర్వాత కేసీఆర్ ఫాంహౌస్‌కు, కేటీఆర్ అమెరికాకు పారిపోవడం ఖాయమన్నారు.
గాంధీభవన్ నుంచి ఫేస్‌బుక్ లైవ్‌తో పాటు చార్మ్స్ ద్వారా పార్టీ బూత్ అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో ఉత్తమ్ మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలంగాణలో అడుగుపెడుతున్నారని, రాష్ట్ర ఏర్పాటులో ఎంతో కృషి చేసిన ఆమె ఇక్కడకు రావడం చరిత్రాత్మక ఘటన అని వ్యాఖ్యానించారు. మేడ్చల్‌లో జరిగే సభకు సోనియాగాంధీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వస్తున్నారని, ఈ సందర్భంగా సోనియాను సన్మానించి గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలకు ఉందని పేర్కొన్నారు.
అప్పుడు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా?
ఆత్మగౌరవం పేరుతో కేసీఆర్ మరోసారి తెలంగాణ ప్రజలన మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని, నేరెళ్ల దళితులను అకారణంగా వేధించి హింసించినపుడు ఆయనకు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా అని ఉత్తమ్ ప్రశ్నించారు. ఖమ్మంలో గిరిజన రైతులు మిర్చి పంటకు మద్దతు ధర అడిగినపుడు పోలీసులు లాఠీలతో కొట్టి కేసులు పెట్టి వేధించినపుడు ఆత్మగౌరవం ఏమైందని నిలదీశారు.
ఢిల్లీకి, అమరావతికి ఆత్మగౌరవం తాకట్టు అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారని.. చంద్రబాబు అభివృద్ధిని అడ్డుకుంటారని ప్రగల్భాలు పలుకుతున్నారని.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతామంటే చంద్రబాబు అడ్డుకున్నాడా, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామంటే ఎవరైనా అడ్డుకున్నారా అని ఉత్తమ్ ప్రశ్నించారు. ఆత్మగౌరవం పేరుతో కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను జనం నమ్మరని, ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దళితులు, గిరిజనులకు భూమి పేరుతో, పేదలకు డబుల్ బెడ్ రూమ్ పేరుతో, ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం చేసి ఓట్లు పొంది గత ఎన్నికలలో విజయం సాధించిన కేసీఆర్ నాటకాలను పూర్తిగా ప్రజలు అర్థం చేసుకున్నారని, ఇక ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని ఉత్తమ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment