
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ మహిళను చిన్న చూపు చూస్తోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో శనివారం మహిళా కాంగ్రెస్ నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. దేశంలో ఒక్క మహిళ కూడా లేని క్యాబినెట్ తెలంగాణలోనే ఉందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ద్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ బతుకమ్మ పండుగ కోసం మహిళలకు అందజేసిన చీరలు నాసిరకమైనవని విమర్శించారు. చేనేత చీరలను ఇస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు నాసిరకం చీరలు ఇచ్చి మహిళలను కించపరిచారన్నారు. కేసీఆర్ కుటుంబ ప్రమోషన్ కోసమే బతుకమ్మ పండుగ సంబరాలను వాడుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు అన్నిరంగాల్లో మరింత మెరుగైన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2019లో కాంగ్రెస్ పార్టీదే అధికారమని స్పష్టం చేశారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని తెలిపారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందలేదో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో 33 శాతం రిజర్వేషన్ కోసం మూడు లక్షల సంతకాల సేకరణ చేయడం అభినందనీయమన్నారు. కేంద్రం ఇప్పటికైనా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేలా చూడాలని కోరారు.