యోగి ఆదిత్యానాథ్
లక్నో: ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయాలని యూపీ సర్కార్ ఆరుగురు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులకు నోటీసులు జారీ చేసింది. పదవి నుంచి దిగిపోయిన తర్వాత అందరూ సమానమేనని, మాజీలుగా మారిన ముఖ్యమంత్రులు కూడా సాధారణ పౌరులేనని.. వారికి ప్రత్యేక వసతులు, హోదాలు అక్కర్లేదని ఈ నెల మొదట్లో సుప్రీం కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రులు ఇంకా ప్రభుత్వ బంగ్లాల్లో ఉంటూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, వాటిని వెంటనే ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీం ఉత్తర్వులను అనుసరించి యోగీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, నారాయణ్ దత్ తివారీ, అఖిలేష్ యాదవ్, కల్యాణ్ సింగ్, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు నోటీసులు జారీ చేసింది. మరో 15 రోజుల్లో భవనాలు ఖాళీ చేయాలని వాటిల్లో వెల్లడించింది. అయితే, సుప్రీం ఉత్తర్వులపై సుముఖంగా లేని ములాయం సింగ్ బుధవారం యోగీతో భేటీ అయ్యారు. ములాయం, ఆదిత్యానాథ్ మధ్య తాజా రాజకీయ పరిణామాలపై మాత్రమే చర్చ జరిగిందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కాగా, ఈ భేటీకి సంబంధించి గోప్యంగా ఉంచాల్సిన పలు విషయాల్ని బహిర్గతం చేశారంటూ సీఎం కార్యాలయం ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయడం గమనార్హం. సీఎం వ్యక్తిగత కార్యదర్శి పితాంబర యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహాయకుడు శిశుపాల్‌లపై వేటు పడింది.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రులకు శాశ్వత నివాస వసతి చట్టం సుప్రీం కోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే. ‘ఉత్తరప్రదేశ్ మినిస్టర్స్ చట్టం- 2016’ రాజ్యాంగ విరుద్ధమంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ చట్టాన్ని అప్పటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం తయారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment