vacates house
-
ఇల్లు ఖాళీ చేయండి.. లోక్‌సభ ఎంపీకి షాక్!
సాక్షి,న్యూఢిల్లీ: దివంగత ఎంపీ రామ్ విలాస్ పాశ్వాన్‌కు కేటాయించిన 12 జన్‌పథ్ బంగ్లాలో నివసిస్తున్న ఆయన కుమారుడు, లోక్‌సభ ఎంపీ చిరాగ్ పాశ్వాన్‌ను ఆ ఇంటి నుంచి ఖాళీ చేయాల్సిందిగా కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ ఇంటినే ప్రస్తుతం లోక్‌జనశక్తి పార్టీ తమ పార్టీ కార్యకలాపాల కోసం ఉపయోగించుకుంటోంది. దాదాపు 30 ఏళ్ల క్రితం నుంచి చిరాగ్ తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఈ ఇంట్లో నివసించారు. ఆయన గతేడాది అక్టోబర్‌లో మరణించారు. కాగా ఇల్లు మారాల్సిందిగా ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై చిరాగ్ పాశ్వాన్ స్పందించలేదు. ప్రస్తుతం ఈ ఇంట్లో రామ్ విలాస్ భార్య, చిరాగ్‌పాశ్వాన్ కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. -
అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేసిన నటి
సంచలన ప్రకటనలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నటి, కాంగ్రెస్ సోషల్ మీడియా చీఫ్ రమ్య సొంత జిల్లా మండ్యలోని ఇంటిని ఖాళీ చేశారు. మండ్య ఎంపీ సీటును తన పార్టీ జేడీఎస్‌కే వదిలేస్తుందని తెలుసుకుని వైరాగ్యంతోనే ఇలా చేశారని సమాచారం. కర్ణాటక, మండ్య: కాంగ్రెస్ నాయకురాలు, శాండల్‌వుడ్ నటి రమ్య ఆదివారం అర్ధరాత్రి చడీచప్పుడు లేకుండా మండ్య పట్టణంలోని ఇంటిని ఖాళీ చేయడం సర్వత్రా ఆసక్తికర చర్చలకు తావిచ్చింది. పట్టణం లో కేఆర్ఎస్ రోడ్‌లోనున్న మాజీ ఎమ్మెల్యే సాదత్ అలీఖాన్ ఇంటిని ఆమె అద్దెకు తీసుకున్న ఉండేవారు. ఇంతలోఆకస్మికంగా ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోని సామాన్లు రెండు లారీల్లో బెంగళూరుకు తరలించారు. రెబెల్‌స్టార్ అంబరీశ్ అంతిమ దర్శనానికి ఆమె గైర్హాజరు కావడంపై మండ్య జిల్లా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మండ్యలోని రమ్య నివాసం ఎందుకని : దీంతోపాటు ఇటీవల మండ్య ఎంపీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న రమ్యకు సంకీర్ణపొత్తుల్లో భాగంగా ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ.. జేడీఎస్‌కు వదిలేయడం కూడా ఆమెకు నిరాశను కలిగించింది. అంతేకాకుండా వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ మండ్య ఎంపీ స్థానాన్ని జేడీఎస్‌కే వదిలేయనున్నట్లు తెలియడంతో ఆమె కంగుతినింది. ఇక జిల్లాలో రాజకీయ భవిష్యత్తు లేదని భావించిన రమ్య పోలీసు భద్రత మధ్య అర్ధరాత్రి ఇంటిని ఖాళీ చేసినట్లు చర్చ సాగుతోంది. ఎంపీగా గెలిచాక నివాసం ఏర్పాటు 2013లో మండ్య ఎంపీగా ఉప ఎన్నికల్లో గెలిచిన రమ్య అదే ఏడాది మండ్య పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే ఇంటిని అద్దెకు తీసుకొని ఉండసాగారు. మరుసటి ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవడంతో కొద్దికాలం మండ్యలోనే ఉండి, అనంతరం బెంగళూరుకు మకాం మార్చారు. కొద్దికాలం క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రమ్యను ఏఐసీసీ సోషల్ మీడియా చీఫ్‌గా నియమించడంతో రమ్య ఢిల్లీ నుంచి వ్యవహారాలు నడిపిస్తున్నారు. అప్పటినుంచి రమ్యకు, రాష్ట్రానికి మధ్య దూరం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. విధానసభ, లోక్‌సభ ఉపఎన్నికల్లో ఓటు వేయడానికి రాకుండా వ్యతిరేకతను మూటగట్టుకున్న రమ్య తాజాగా అంబరీశ్ అంతిమ దర్శనానికి కూడా రాకపోవడంతో రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా మండ్య జిల్లా ప్రజల్లో మరింత అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. -
ఇల్లు ఖాళీ చేయండి : నటుడు తల్లికి హైకోర్టు సూచన
సాక్షి బెంగళూరు: డిసెంబర్‌లోగా ఇంటి అద్దె చెల్లించి ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేయాలని రాకింగ్ స్టార్ యశ్ తల్లి పుష్పకు హైకోర్టు బుధవారం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. వివరాలు..2010, అక్టోబర్ 16 నుంచి కత్రిగుప్పేలోని తమ ఇంటిలో పుష్ప నివాసం ఉంటూ అద్దె చెల్లించడం లేదని, అద్దె కోసం వెళితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఇంటి యజమాని మునిప్రసాద్ గిరినగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసును విచారించిన సిటీ సివిల్ కోర్టు... మూడు నెలల్లో ఇంటి అద్దె రూ. 9.60 లక్షలను చెల్లించి ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ యశ్ తల్లి పుష్ప హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బోపణ్ణ, జస్టిస్ శ్రీనివాస్ హరీశ్ కుమార్ల ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. అద్దె మొత్తం రూ. 23.27 లక్షలను తక్షణమే చెల్లిస్తే వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉండొచ్చని, లేదంటే డిసెంబర్‌లోగా అద్దె మొత్తం చెల్లించి ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుందని పుష్పకు హైకోర్టు ఆదేశించింది. -
రిపోర్టరుకు షాకిచ్చిన అఖిలేష్
లక్నో : మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేసి వెళ్లాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో తమకు కొంత సమయం కావాలంటూ సమాజ్‌వాద్ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై అఖిలేష్ మీడియాకు సవాల్ చేశారు. .‘నాకు అనుకూలమైన ఇంటిని చూడండి...అప్పుడు నేను ఈ బంగ్లాను వదిలి వెళ్తాను’ అని తెలిపారు. మహారాష్ట్రలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు గురించి అఖిలేష్ మీడియాతో మాట్లాతుండగా...ఒక జర్నలిస్ట్ ‘అధికార బంగ్లాలను వదిలి వెళ్లే అంశం’ గురించి ప్రస్తావించాడు. దానికి ఆయన ఏమాత్రం తడుముకోకుండా ‘మేము ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం...కానీ మాకు కొంత సమయం కావాలి. నాకు, నేతాజీకి ఈ లక్నో పట్టణంలో నివసించడానికి స్థలం లేదు. ఒక వేళ మీరు మాకోసం అనువైన ప్రదేశాన్ని చూస్తే..అప్పుడు మేము తప్పకుండా ఈ బంగ్లాను ఖాళీ చేస్తామ’ని అన్నారు. అంతేకాకుండా విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆ జర్నలిస్ట్‌పై అఖిలేష్ అసహనం వ్యక్తం చేశారు. మాజీ సీఎంలు ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలన్న సుప్రీం ఆదేశాలను అనుసరించి యూపీ సర్కార్ మాజీ ముఖ్యమంత్రులకు నివాసాలు ఖాళీ చేయవల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ములాయం ఆరోగ్యం దృష్ట్యా ఇప్పటికిప్పుడే ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయలేమని, తమకు రెండేళ్ల సమయం కావాలంటూ అఖిలేష్ యాదవ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. -
సుప్రీంను ఆశ్రయించిన మాజీ సీఎంలు
సాక్షి, న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్, ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలో నివాసం ఉండరాదని, వెంటనే ఖాళీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ అత్యున్నత ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం లక్నోలో నివాసం ఉంటున్న బంగ్లాను ఖాళీ చేయడానికి తమకు రెండేళ్లు గడువు కావాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. మాజీ సీఎంలు ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలన్న సుప్రీం ఆదేశాలను అనుసరించి యూపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రులకు నివాసాలు ఖాళీ చేయవల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడే ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయలేమని, తమకు కొంత సమయం కావాలంటూ అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్, మాయావతి, ఎన్డీ తివారిలు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విధితమే. -
మాజీ సీఎంలకు యూపీ సర్కార్ నోటీసులు
లక్నో: ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయాలని యూపీ సర్కార్ ఆరుగురు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులకు నోటీసులు జారీ చేసింది. పదవి నుంచి దిగిపోయిన తర్వాత అందరూ సమానమేనని, మాజీలుగా మారిన ముఖ్యమంత్రులు కూడా సాధారణ పౌరులేనని.. వారికి ప్రత్యేక వసతులు, హోదాలు అక్కర్లేదని ఈ నెల మొదట్లో సుప్రీం కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రులు ఇంకా ప్రభుత్వ బంగ్లాల్లో ఉంటూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, వాటిని వెంటనే ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం ఉత్తర్వులను అనుసరించి యోగీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, నారాయణ్ దత్ తివారీ, అఖిలేష్ యాదవ్, కల్యాణ్ సింగ్, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు నోటీసులు జారీ చేసింది. మరో 15 రోజుల్లో భవనాలు ఖాళీ చేయాలని వాటిల్లో వెల్లడించింది. అయితే, సుప్రీం ఉత్తర్వులపై సుముఖంగా లేని ములాయం సింగ్ బుధవారం యోగీతో భేటీ అయ్యారు. ములాయం, ఆదిత్యానాథ్ మధ్య తాజా రాజకీయ పరిణామాలపై మాత్రమే చర్చ జరిగిందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కాగా, ఈ భేటీకి సంబంధించి గోప్యంగా ఉంచాల్సిన పలు విషయాల్ని బహిర్గతం చేశారంటూ సీఎం కార్యాలయం ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయడం గమనార్హం. సీఎం వ్యక్తిగత కార్యదర్శి పితాంబర యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహాయకుడు శిశుపాల్లపై వేటు పడింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రులకు శాశ్వత నివాస వసతి చట్టం సుప్రీం కోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే. ‘ఉత్తరప్రదేశ్ మినిస్టర్స్ చట్టం- 2016’ రాజ్యాంగ విరుద్ధమంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ చట్టాన్ని అప్పటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం తయారు చేసింది. -
చిట్టిల పేరుతో ఘరానా మోసం
చిట్టిల పేరుతో ఓ మహిళ జనానికి రూ. కోటి కుచ్చు టోపి పెట్టి.... అర్థరాత్రి తట్టా బుట్టా సర్ధుకుని ఉడాయించింది. ఆ ఘటన గుంటూరు జిల్లా బాపట్లలోని రెల్లి కాలనీలో చోటు చేసుకుంది. రెల్లి కాలనీలో నివసిస్తున్న నాంచరమ్మ అనే మహిళ స్థానిక మహిళలతో ఎంతో చనువు, నమ్మకంగా ఉంటూ వారితో చీటీలు కట్టించుకుంటుంది.ఆ క్రమంలో కొంత కాలం వరకు సక్రమంగా చిట్టిల డబ్బులు చెల్లించేది. కొంతకాలం తర్వాత నగదు చెల్లించాలంటూ చిట్టిల కట్టిన సదరు మహిళలు వస్తుండటంతో తర్వాత ఇస్తానంటూ చెబుతు వస్తుంది. దాంతో చిట్టి వేసిన మహిళలు తమకు డబ్బు చెల్లించాలంటూ ఆమెపై ఒత్తిడి చేశారు. దాంతో గత అర్థరాత్రి ఆమె ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. శుక్రవారం ఆ విషయాన్ని గమనించిన బాధితులు లబోదిబోమంటూ బాపట్ల పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.