సంచలన ప్రకటనలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నటి, కాంగ్రెస్ సోషల్ మీడియా చీఫ్ రమ్య సొంత జిల్లా మండ్యలోని ఇంటిని ఖాళీ చేశారు. మండ్య ఎంపీ సీటును తన పార్టీ జేడీఎస్‌కే వదిలేస్తుందని తెలుసుకుని వైరాగ్యంతోనే ఇలా చేశారని సమాచారం.
కర్ణాటక, మండ్య: కాంగ్రెస్ నాయకురాలు, శాండల్‌వుడ్ నటి రమ్య ఆదివారం అర్ధరాత్రి చడీచప్పుడు లేకుండా మండ్య పట్టణంలోని ఇంటిని ఖాళీ చేయడం సర్వత్రా ఆసక్తికర చర్చలకు తావిచ్చింది. పట్టణం లో కేఆర్‌ఎస్ రోడ్‌లోనున్న మాజీ ఎమ్మెల్యే సాదత్ అలీఖాన్ ఇంటిని ఆమె అద్దెకు తీసుకున్న ఉండేవారు. ఇంతలోఆకస్మికంగా ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోని సామాన్లు రెండు లారీల్లో బెంగళూరుకు తరలించారు. రెబెల్‌స్టార్ అంబరీశ్ అంతిమ దర్శనానికి ఆమె గైర్హాజరు కావడంపై మండ్య జిల్లా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
మండ్యలోని రమ్య నివాసం
ఎందుకని : దీంతోపాటు ఇటీవల మండ్య ఎంపీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న రమ్యకు సంకీర్ణపొత్తుల్లో భాగంగా ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ.. జేడీఎస్‌కు వదిలేయడం కూడా ఆమెకు నిరాశను కలిగించింది. అంతేకాకుండా వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ మండ్య ఎంపీ స్థానాన్ని జేడీఎస్‌కే వదిలేయనున్నట్లు తెలియడంతో ఆమె కంగుతినింది. ఇక జిల్లాలో రాజకీయ భవిష్యత్తు లేదని భావించిన రమ్య పోలీసు భద్రత మధ్య అర్ధరాత్రి ఇంటిని ఖాళీ చేసినట్లు చర్చ సాగుతోంది.
ఎంపీగా గెలిచాక నివాసం ఏర్పాటు
2013లో మండ్య ఎంపీగా ఉప ఎన్నికల్లో గెలిచిన రమ్య అదే ఏడాది మండ్య పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే ఇంటిని అద్దెకు తీసుకొని ఉండసాగారు. మరుసటి ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవడంతో కొద్దికాలం మండ్యలోనే ఉండి, అనంతరం బెంగళూరుకు మకాం మార్చారు. కొద్దికాలం క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రమ్యను ఏఐసీసీ సోషల్ మీడియా చీఫ్‌గా నియమించడంతో రమ్య ఢిల్లీ నుంచి వ్యవహారాలు నడిపిస్తున్నారు. అప్పటినుంచి రమ్యకు, రాష్ట్రానికి మధ్య దూరం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. విధానసభ, లోక్‌సభ ఉపఎన్నికల్లో ఓటు వేయడానికి రాకుండా వ్యతిరేకతను మూటగట్టుకున్న రమ్య తాజాగా అంబరీశ్ అంతిమ దర్శనానికి కూడా రాకపోవడంతో రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా మండ్య జిల్లా ప్రజల్లో మరింత అపఖ్యాతిని మూటగట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment