‘చంద్రబాబూ.. అది నీ అయ్య తరం కూడా కాదు’ | Vallabhaneni Balashowry Satires On Chandrababu Naidu And Yellow Media | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబూ.. అది నీ తరం కాదు’

Published Mon, Apr 8 2019 2:29 PM | Last Updated on Mon, Apr 8 2019 7:21 PM

Vallabhaneni Balashowry Satires On Chandrababu Naidu And Yellow Media - Sakshi

సాక్షి, మచిలీపట్నం : పచ్చమీడియా ఎన్ని పచ్చిరాతలు రాసినా.. వైఎస్‌ జగన్‌ను ఓడించడం.. చంద్రబాబు తరం కాదు కదా.. ఆయన్ని పుట్టించినోడి తరం కూడా కాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభకు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా బౌలశౌరి మాట్లాడుతూ.. చంద్రబాబు..ఎల్లోమీడియాపై మండిపడ్డారు. తన ప్రసంగంలో వ్యంగ్యాస్త్రాలు, పిట్టకథలతో ఆకట్టుకున్నారు.

‘మీ అందరిని చూస్తుంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావడం కాయం. గత ఎన్నికల్లో చంద్రబాబు బందరు వచ్చి.. మమ్మల్ని గెలిపించండి.. ఈ బందర్‌ను బందరు లడ్డులా చేస్తానని చెప్పాడు. బందర్‌ను బందరు లడ్డూ చేయలేదు కానీ ఆయన కొడుకు లోకేష్‌ బాబును మాత్రం అవసరానికి ఎక్కువగా బందరు లడ్డు మాదిరిలా చేశాడు. చంద్రబాబు ప్రతి ఎన్నికల్లో ప్రతి పార్టీతో  పొత్తుపెట్టుకున్నారు. సీపీఐ, సీపీఎం, బీజేపీ, టీఆర్‌ఎస్‌తో.. చివరకు సిగ్గు శరం లేకుండా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకున్నారు. కానీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సింగిల్‌గా వస్తోంది. సింహంలా వైఎస్‌ జగన్‌ సింగిల్‌గా వస్తున్నారు.

చంద్రబాబు నాయుడు, ఓ మీడియాధిపతికి సంబంధించిన వీడియో గత నాలుగు రోజులుగా వైరల్‌ అవుతోంది. అదేంటో తెలుసా.. చంద్రబాబు నాయుడిని ఇంటర్వ్యూ చేస్తున్న ఆ మీడియాధిపతి.. ఇంటర్వ్యూకు ముందు మాట్లాడుకున్న సంగతులు. వీరు అధికారంలోకి రాగానే పథకాలకు వాడి(ఎన్టీఆర్‌) పేరు తీసేద్దామని, పిల్లనిచ్చిన మామ అనే గౌరవం లేకుండా చంద్రబాబు అమర్యాదకంగా మాట్లాడారు. ఇలా మనిషి ముందు ఒకలా, మనిషి వెనుకా ఒకలా మాట్లాడే నైజం చంద్రబాబుది. దీనికి గురించి ఒక ఉదహారణ చెప్పుతా.. ఒక రైతు సోదరుడు బాగా శ్రమించి చెట్టు కింద మంచంపై గుర్రుకొడుతూ నిద్రపోతున్నాడట.. ఈ చంద్రబాబులాంటోడు ఒకడు అక్కడికి వచ్చి నిద్రపోతున్న రైతన్నకు ఉన్న వేలు ఉంగరాన్ని దొంగలించే ప్రయత్నం చేశాడంట. వెంటనే ఆ రైతు మేల్కొనగానే.. లేదు బావా.. నీవు కనుక్కుంటావో లేదోనని చేశా అన్నాడట. అది చంద్రబాబు నైజం.

ఈ ఎల్లో మీడియా అంతా ఒకవైపు చేరి విషరాతలు రాస్తుంది. భయంకరంగా చూపిస్తోంది. వారెన్ని రాతలు రాసినా.. జగన్‌ను ఓడగట్టడం చంద్రబాబు తరం కాదు కదా.. ఆయనను పుట్టించినోడి తరం కూడా కాదు. ఈ ఎల్లో మీడియా అసత్యపు వార్తలు నవ్మవద్దు. తెలంగాణలో ప్రజలు వాతపెట్టారు. అది సౌండ్‌ మాత్రమే.. ఇక్కడి ఫలితాలతో రీ సౌండ్‌ వినిపిస్తోంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి.. పొరపాటున కూడా ఎవ్వరిని సైకిల్‌ ఎక్కవద్దని చెప్పండి. సైకిల్‌ ఎక్కారా వడదెబ్బ తగిలి ఆసుపత్రి పాలవుతారు. డిశ్చార్జ్‌ కావాడానికి 5 ఏళ్లు పడుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రజానికానికి కావాల్సింది చల్లటి గాలి. అది ఒక్క సీలింగ్‌ ఫ్యాన్‌ ద్వారానే సాధ్యం. సీలింగ్‌ ఫ్యాన్‌కు ఓటేద్దాం.. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మచిలీపట్నం పోర్ట్‌, ప్రత్యేకహోదాను సాధించుకుందాం. పరిశ్రమలు తెప్పించి నిరుద్యోగ సమస్యను తగ్గిద్దాం. ఇక బైబై బాబు.. బైబై బాబు.. కావాలి జగన్‌.. రావాలి జగన్‌’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement