
సమావేశంలో మాట్లాడుతున్న రాధా
కేశవరం (మండపేట): విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే, కాపు నేత స్వర్గీయ వంగవీటి రంగా తనయుడు రాధాకు మండపేట మండలం కేశవరంలో ఘోరపరాభవం ఎదురైంది. బుధవారం రాత్రి మండపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు మద్దతుగా కేశవరం వచ్చిన ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. ‘రాధాకృష్ణ గో బ్యాక్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిసితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్లకు మద్దతుగా బుధవారం రాధా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కపిలేశ్వరపురం మండలంలో ప్రచారం ముగించుకుని రాత్రి సమయంలో కేశవరం వచ్చారు.
కేశవరంలో రాధా రాకను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు
అప్పటికే రాధా వస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక కాపు సామాజిక వర్గీయులు అధిక సంఖ్యలో గ్రామంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలోకి చేరుకున్నారు. రాధా కాన్వాయి గ్రామంలోకి వస్తున్న సమయంలో అడ్డుకున్నారు. తండ్రిని చంపిన పార్టీలో చేరి, ఆ పార్టీకి మద్దతుగా ఎలా ప్రచారం చేస్తున్నావంటూ మండిపడ్డారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అనపర్తి, రామచంద్రపురంల నుంచి అదనపు బలగాలను రప్పించారు. మండపేట రూరల్ సీఐ లక్ష్మణరెడ్డి ఆందోళనకారులతో చర్చించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు పోలీసులతో గ్రామస్తులు తీవ్ర వాగ్వివాదానికి దిగారు. రూరల్ సీఐ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడం సరికాదని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. రాధాను అక్కడి నుంచి రాజమహేంద్రవరం వైపు పంపించివేశారు.
మీరు నా మీద ఎంత ద్వేషం పెంచుకున్నా ఫర్వాలేదు: రాధామీరు నా మీద ఎంత ద్వేషం పెంచుకున్నా ఫర్వాలేదని, అంతే ప్రేమ, ఆప్యాయత, అనురాగం రంగా మీద చూపించాలని, అది తనకు చాలని రాధా పేర్కొన్నారు. అక్కడి నుంచి ఆయన కాన్వాయిలో ముందుకు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment