![Vasireddy Padma Fires on TDP Leaders - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/11/vv.jpg.webp?itok=LxQexUHg)
సాక్షి, హైదరాబాద్: ‘బూతులు మాట్లాడటం టీడీపీ నాయకుల నైజమా? ఇదేనా మీ పార్టీ నాయకులకు ఇచ్చే శిక్షణ?’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దూషణలను ఆమె తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బండ బూతులు మాట్లాడుతుంటే.. అదే వేదికపై ఉన్న చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వుకోవడాన్ని అందరూ చూశారన్నారు.
ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సభ్యసమాజం సిగ్గుపడేలా ఓ మహిళ గురించి మాట్లాడినా కూడా చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. బోడె ఓ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే సీఎం చంద్రబాబే దగ్గరుండి మరీ బూతురాయుళ్లను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందన్నారు. బూతులు మాట్లాడటానికి టీడీపీ కార్యాలయంలో ఏమైనా శిక్షణ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రజాధనంతో చంద్రబాబు విదేశాల్లో జల్సాలు చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఇప్పటివరకు చంద్రబాబు చేసిన విదేశీ పర్యటనలెన్ని? ఇందుకు ఖర్చు చేసిన ప్రజాధనమెంత? తెచ్చిన పెట్టుబడులెన్నో ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాలుగేళ్లలో చంద్రబాబు 25 విదేశీ పర్యటనలు చేశారని, ఇందుకోసం రూ.వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment