రాజధానిలో మహిళలకు రక్షణ లేదా? | Do you care for women in the capital area? | Sakshi
Sakshi News home page

రాజధాని ప్రాంతంలో మహిళలకు రక్షణ లేదా?

Published Thu, Apr 26 2018 4:12 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Do you care for women in the capital area? - Sakshi

బుధవారం గుంటూరు జీజీహెచ్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్న వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం కార్యకర్తలు

సాక్షి, గుంటూరు/కారంపూడి: రాజధాని ప్రాంతంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో అత్యాచారానికి గురై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను బుధవారం వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నేతలతో కలిసి ఆమె పరామర్శించారు. గైనకాలజీ వార్డులోని వైద్యులతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసి సూపరింటెండెంట్‌ రాజునాయడును కలిసి మెరుగైన చికిత్సను అందించాలని కోరారు. తర్వాత జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ చాంబర్‌ ఎదుట, ఆస్పత్రి ప్రాంగణంలో బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న జిల్లాలో వరుస అత్యాచారాలు జరగడం బాధాకరమన్నారు. ఈ సంఘటన విన్న వెంటనే చలించిపోయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధిత మహిళలకు ధైర్యం చెప్పి అండగా నిలవాలని తమను పంపించారని చెప్పారు. నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పిల్లలు, మహిళలపై 15 అత్యాచార ఘటనలు జరిగినా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు.

దారుణ అత్యాచార ఘటన వెలుగు చూసి 24 గంటలు గడుస్తున్నా నిందితుడిని అరెస్టు చేయకపోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వం బాధితురాలికి న్యాయం చేస్తుందనే నమ్మకం కలగడం లేదన్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన నిందితుడు అధికార పార్టీ సానుభూతిపరుడు కాబట్టే ఇంకా అతన్ని అరెస్టు చేయకుండా అధికార పార్టీ నాయకులు రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్, మంత్రులు ఈ ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ కనీసం బాధితురాలిని పరామర్శించి అండగా ఉంటామనే ధైర్యం ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మహిళలపై జరుగుతున్న దాడుల ఘటనల్లో ఏపీ రెండో స్థానంలో నిలవడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. 

సీఎం రాజీనామా చేయాలి
రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి ప్రజలే తనకు వలయంగా ఏర్పడి రక్షణ కల్పించాలని అడుగుతున్నారని, అలాంటి వ్యక్తి మహిళలకు ఏం రక్షణ కల్పిస్తాడని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ప్రజలకు రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నపుడు సీఎం పదవికి రాజీనామా చేయాలని చంద్రబాబును డిమాండ్‌ చేశారు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామన్న సంకేతం ఇవ్వకపోతే  పరిస్థితులు ఎలా బాగుపడతాయన్నారు.

టీడీపీ అధికారం చేపట్టాక అమరావతి కేంద్రంగా కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ బయట పడితే అందులో అధికార పార్టీకి చెందిన ప్రముఖులుండడంతో ప్రభుత్వం ఆ కేసు నీరుగార్చిందని ఆరోపించారు. ఇసుక, మట్టి దోచుకునేవారికి ఈ ప్రభుత్వంలో కొమ్ములొస్తున్నాయని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున, జగన్‌మోహన్‌రెడ్డి తరఫున బాధితురాలికి ధైర్యాన్ని కల్పించడంతోపాటు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలిని పరామర్శించిన వారిలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్‌ గులాం రసూల్, మహిళ విభాగం నేతలు గనిక ఝాన్సీరాణి, మేరిగ విజయలక్ష్మి, నిమ్మరాజు శారదా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా పాశవికంగా అత్యాచారం చేసిన ఒప్పిచర్లకు చెందిన మైనర్‌ బాలుడు ఎస్‌కే సైదులుపై అత్యాచారం కేసు నమోదు చేశామని, త్వరలోనే అరెస్టు చేస్తామని కారంపూడి ఎస్‌ఐ మురళి తెలిపారు. 

జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శిస్తున్న వాసిరెడ్డి పద్మ, అప్పిరెడ్డి తదితరులు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement