'మీకు ముందుంది ముసళ్ల పండుగ'
హైదరాబాద్: ఈడీ ఆస్తుల అటాచ్ ను సాకుగా తీసుకొని టీడీపీ దుష్ఫ్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. ఈడీ న్యాయ నిర్ధారణ సంస్థ మాత్రమేనని, పోలీసులాంటి వ్యవస్థే అని చెప్పారు. విచారణ ఇంకా జరుగుతుందని, తుది తీర్పు రావాల్సి ఉందని, ఆస్తులు అటాచ్ చేసినంత మాత్రానా స్వాధీనం చేసుకున్నట్లు కాదని ఆమె అన్నారు. వైఎస్ఆర్ ఉన్నన్ని రోజులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక వ్యాపార వేత్త అని గుర్తు చేశారు.
వైఎస్ చనిపోయిన తర్వాత వైఎస్ జగన్ చేసిన ఓదార్పు యాత్రతో అసాధారణ ప్రజాభిమానం సంపాధించారని, దాంతో కాంగ్రెస్, టీడీపీలు భయపడి ఆయన ఆస్తులపై తప్పుడు విచారణ పిటిషన్ లు వేశారని అన్నారు. నిజనిజాలు త్వరలోనే తెలుస్తాయని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తిరిగి ఆస్తులు వస్తాయని, ఎప్పటికైనా న్యాయానిదే విజయం అని ఆమె అన్నారు. టీడీపీ నాయకులకు ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. ఈడీ అటాచ్ సాకుగా టీడీపీ చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అవాస్తవాలను ప్రచారం చేయొద్దని, దుష్ప్రచారాలు ఆపేయాలని, తుది తీర్పు వచ్చాక మాట్లాడాలని అన్నారు.
ఎంతసేపు వైఎస్ జగన్ ను ప్రజల నుంచి దూరం చేసేందుకే కుట్రలు చేస్తున్నారని, వైఎస్ఆర్ సీపీ మూతపడిపోతుందని కలలు కంటున్నారని, అది ఎప్పటికీ జరగదని చెప్పారు. విచారణ పూర్తి కాకుండానే అటాచ్ అంటే ఒక భూతంగా చూపిస్తున్నారని, నోటుకు ఓట్ల కేసులో దొరికిపోయిన ఎవరికి తెలియదని అనుకుంటున్నారని అన్నారు. ఛార్జిషీట్లలో ఉన్న ఐఏఎస్లు నిబంధనల మేరకే వ్యవహరించినట్లు ప్రభుత్వాలే కోర్టుల్లో చెప్తున్నాయని ఆమె అన్నారు. చంద్రబాబు అవినీతిపై తాము పుస్తకాన్ని ముద్రించామని, ఆయన నిజాయితీ పరుడైతే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. చంద్రబాబు శైలి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని అన్నారు.