హైదరాబాద్: చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విమానం ఎక్కించి సింగపూర్ చూసి రమ్మనడమేంటని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఇదేం వెర్రిబాగుల ప్రభుత్వమో అర్థం కావడం లేదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... భూములు కోల్పోయి, ఉద్యోగం లేక, ప్రభుత్వం ఇస్తామన్న ప్లాట్లు ఇవ్వకపోవడంతో 29 గ్రామాల రైతులు నరకయాతన అనుభవిస్తుంటే.. అవేమీ పట్టించుకోకుండా సింగపూర్ పేరుతో రైతులను చంద్రబాబు మభ్యపెట్టడం దారుణమన్నారు. బాబు మాటలు నమ్మి భూసేకరణకు రైతులు 34వేల ఎకరాలు ఇస్తే... ఆయన మాత్రం తన రియల్ ఎస్టేట్ సినిమా చూసిరమ్మని వేయి ఎకరాలకు ఒకరు చొప్పున 34 మందిని సింగపూర్ చూడడానికి బస్సెక్కించారన్నారు. అసంతృప్తితో ఉన్న రైతులను సింగపూర్ పేరుతో ఆయింట్ మెంట్ రాసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
‘పంటలు పండే 34 వేల ఎకరాల జరీబు భూములను తీసుకున్నప్పుడు ఇలాంటి విలువగల భూములనే ఇస్తామని చెప్పారు. ఇవాళ అవి రైతులకు ఇచ్చారా..? బెదిరించకుండా, పోలీసుల సహాయం లేకుండా రైతుల వద్దకెళ్లి వారి మధ్యలో నిలబడి నేను రైతులకు ఇది చేశాను, కమర్షియల్ ప్లాట్లు ఇచ్చానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? హామీలు అమలు చేశామని చెప్పే ధైర్యం ఉందా..? అని నిలదీశారు. చంద్రబాబు తన డొల్లతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు సింగపూర్ చూసి రండి, అమరావతి గురించి కలలు కనండి అనే దుస్థితికి వెళ్లారు. సీఆర్డీఏ సమావేశాల్లో పోలీసు అధికారాన్ని ప్రయోగించి రైతులను ఏనాడు మాట్లాడనీయకుండా చేశారు. 29 గ్రామాల రైతుల పక్షాన మేం అడుగుతున్నాం. ఇప్పటిదాక కాగితాల మీద తప్ప ఇవి మీ ప్లాట్లు అని రైతులకు చూపించిన పరిస్థితి ఉందా? భూములిచ్చిన రైతుల ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇంతవరకు అతీగతీ లేదు. మీరు సింగపూర్ చూపిస్తామంటే వారి కడుపు నిండుతుందా..? ఇంత అన్యాయం చేస్తారా..? రైతులు ఆర్థికంగా బలహీనులయితే దానికి సమాధానం చెప్పకుండా సింగపూర్ చూపిస్తామనడం దారుణం.
రైతులు స్థలమిచ్చి రాజధాని నిర్మాణం చేయమంటే చేయకుండా, కేంద్రం ఇచ్చిన నిధుల్నికూడా దారి మళ్లించి మింగేశారు. ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పమని కేంద్రం అడుగుతుంటే సమాధానం లేదు. రైతుల భూములకు ప్లాట్లు కూడ చూపించడం లేదు. రైతు కూలీలకు ఇచ్చే పింఛన్ కూడ సరిగా ఇవ్వడం లేదు. అంతర్జాతీయ వేదికల మీద గొప్పలు చెప్పుకునే మీరు రైతులకు తిరిగి ఏమి ఇచ్చారు. మూడున్నరేళ్ల తర్వాత కూడ రాజధాని నిర్మాణం లేదు. రైతులకు ఇచ్చిన మాట ఒక్కటి కూడ అమలు జరగడం లేదు. రుణమాఫీ, ఇంటికోఉద్యోగం, నెలనెల పెన్షన్ అన్నారు. అవేమీ చేయకుండా రైతుల అసంతృప్తిని గమనించి సింగపూర్ ను చూపిస్తే వారు మాట్లాడకుండా ఉంటారని బాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బాబు మనీ ల్యాండరింగ్ కు సింగపూర్ ఓ సెంటర్, ఆయన పరివారం అంతా అక్కడ ఆస్తులు కూడగట్టుకున్నారు. రాజధాని నిర్మాణం కట్టలేక బాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాజమౌళిని, రైతులను ఉపయోగించుకుంటున్నారన్నారు. ఏపీ ప్రతిష్టను విదేశాల్లో దిగజారుస్తున్నారు. కల్లబొల్లి వ్యవహారాలు కట్టిబెట్టి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాల’ని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment