సాక్షి ప్రతినిధి, ఏలూరు: తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ కలవడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం తన రాజీనామా లేఖను హైకమాండ్‌కు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇరు పార్టీల అధ్యక్షులు రాహుల్, చంద్రబాబు ఢిల్లీలో గురువారం భేటీ కావడం, కలిసి పనిచేయాలని నిర్ణయించడం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. చంద్రబాబు లాంటి వ్యక్తితో చేతులు కలుపడమంటే పార్టీని పూర్తిగా దెబ్బతీయడమేనని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిణామాల పట్ల కలత చెందిన మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన బాటలో నడిచేందుకు మరికొందరు నేతలు సిద్ధమవుతున్నారు. 1970వ దశకం మొదట్లో కాంగ్రెస్‌లో చేరి 45 సంవత్సరాలుగా ఇంకో పార్టీవైపు చూడలేదని వట్టి వసంత్‌కుమార్ ‘సాక్షి’తో అన్నారు. 1983లో ఎన్‌టీ రామారావు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని పెడితే వీధులెక్కి పోరాటాలు చేశామని, ఎన్‌టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తాము ఎన్నడూ వెనుతిరిగి చూడలేదన్నారు.
2014లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని విడగొడితే పార్టీ ఓటింగ్ రెండు శాతానికి పడిపోయిందన్నారు. అయినా తాము పార్టీని వదలకుండా, దాన్ని బతికించుకోవాలని నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పోరాటాలు చేశామన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి నిజాయితీతో పనిచేసుకుంటూ వచ్చాను, ఈరోజు సమాజాన్ని దోచేసిన నాయకులతో స్టేజి పంచుకోగలనా? అని వట్టి ప్రశ్నించారు. ఏ ఒక్కరితో వేలు పెట్టి చూపించుకునే పరిస్థితిలో తాను ఉండనని, అందుకే ఈ అనైతిక కార్యాచరణకి వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment