
పటాన్‌చెరు టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టిందని, పాత సచివాలయం ఉండగా కొత్తది కట్టడం అవసరమా అని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ప్రశ్నిం చారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో మంగళవారం ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాస్తు పిచ్చితో ముఖ్యమంత్రి చేస్తున్న తుగ్లక్ చేష్టలకు రాష్ట్రం దివాలా తీసిందని విమర్శించారు.
బేగంపేటలో క్యాంపు కార్యాలయం కోసం గత ప్రభుత్వ హయాంలో రూ.30 కోట్లతో పెద్ద భవనం నిర్మిస్తే.. వాస్తు బాగా లేదని రూ.160 కోట్లతో ప్రగతి భవన్ పేరుతో రాజభవనం నిర్మించుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని పదేపదే చెప్పుకునే కేసీఆర్.. ఇప్పటి వరకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎందుకు కట్టలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో మంగళవారం ఒక్కరోజే 20 కేంద్రాల వద్ద ప్రజా బ్యాలెట్ నిర్వహించామని, బుధవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో లెక్కిస్తామని వీహెచ్ పేర్కొన్నారు.