బీసీ బిల్లుకు కేంద్రం నో | Vijaya Sai Reddy Demanded Voting On BC Bill In Parliament | Sakshi
Sakshi News home page

బీసీ బిల్లుకు కేంద్రం నో

Published Sat, Jul 13 2019 1:56 AM | Last Updated on Sat, Jul 13 2019 10:00 AM

Vijaya Sai Reddy Demanded Voting On BC Bill In Parliament - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తాను ప్రవేశపెట్టిన బిల్లు ఓటింగ్‌కు రాకుండా కేంద్రం ప్రదర్శించిన వైఖరికి నిరసనగా రాజ్యసభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి వాకౌట్‌ చేశారు. చట్టసభల్లో ఓబీసీల జనాభా నిష్పత్తికి అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదిస్తూ రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ‘ప్రైవేట్‌’బిల్లుపై జూన్‌ 21న సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. అప్పుడు చర్చ ముగియకుండానే సభ వాయిదా పడటంతో శుక్రవారం తిరిగి ఈ బిల్లుకు చర్చకు వచ్చింది. చర్చ ముగియడానికి ముందు కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఓబీసీ వర్గాలకు చెందిన ముఖ్య నేతలు ఎందరో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని, ఓబీసీలకు రిజర్వేషన్లు అడిగి వారి సేవలను తక్కువ చేసి చూడరాదని పేర్కొంటూ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు.

రాజ్యాంగం ప్రకారం.. 2026 వరకు లోక్‌సభ స్థానాలు గానీ, విధాన సభల స్థానాలు గానీ పెరగవన్నారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి వాదనను తిప్పికొట్టారు. బిల్లుపై 14 మంది సభ్యులు మాట్లాడగా ఒకరిద్దరు మినహా అందరూ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల అభ్యున్నతికి పాటుపడే పార్టీ అన్నారు. దేశంలో వారి జనాభా దామాషా ప్రకారం.. వారికి ప్రాతినిధ్యం ఉందా అని ప్రశ్నిం చారు. దాదాపు 29 రాష్ట్రాల్లోనూ ఓబీసీల జనాభా సగాని కంటే ఎక్కువగా ఉందన్నారు. అలాంటప్పు డు వారికి ప్రాతినిధ్యం ఎందుకు దక్కకూడదు అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలిచినట్టుగానే ఓబీసీలకు కూడా అండగా నిలవాలని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం 2026 వరకు సీట్లు పెరగవు కాబట్టి ఈ బిల్లు అమలు చేయలేమని మంత్రి పేర్కొన్నారని, ప్రస్తుతం ఉన్న సంఖ్యలోనే ఓబీసీలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించవచ్చని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రిజర్వేషన్లు కల్పించడం ద్వారానే ఓబీసీల ప్రయోజనాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ఈ సమయంలో సభాపతి స్థానంలో ఉన్న డాక్టర్‌ సత్యనారాయణ జతియా బిల్లును ఉపసంహరించుకుంటున్నారా అని ప్రశ్నించారు. దీనికి విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ఉపసంహరించుకోవడం లేదని, బిల్లుపై ఓటింగ్‌ జరగాలని పట్టుబట్టారు.  

ఉన్నవారిలో రెండొంతుల మంది చాలు.. 
రవిశంకర్‌ ప్రసాద్‌ తిరిగి జోక్యం చేసుకుంటూ బిల్లును ఉపసంహరించుకోవాలని సూచించారు. ఓబీసీల కోసం రిజర్వేషన్లు కోరుకుంటే రాజ్యాంగ సవరణ బిల్లు తేవాలని, అది ఇలా సాధ్యం కాదన్నారు. దీంతో బిల్లును ఉపసంహరించుకుంటున్నారా అని సభాపతి మరోసారి ప్రశ్నించారు. ఈ సమయంలో సభలో గందరగోళం నెలకొంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు సభలో సగం మంది ఉండాలని, అంటే కనీసం 123 మంది సభ్యులు ఉండాలని, మూడింట రెండు వంతుల మంది సభ్యులు ఆమోదించాలని సభా నాయకుడు థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ అన్నారు. ఇప్పుడు సభలో సభ్యులు లేనందున బిల్లును ఉపసంహరించుకోవాలని సూచించారు. రవిశంకర్‌ ప్రసాద్‌ కూడా ఇదే సూచించారు. దీంతో న్యాయ మంత్రి చెబుతున్న అభ్యంతరం ఏంటో స్పష్టం చేయాలని విజయసాయిరెడ్డి కోరారు.

‘నేను మధ్యాహ్నం 3 గంటలకు న్యాయ మంత్రి వద్దకు వెళ్లి ప్రభుత్వం ఓబీసీల ప్రయోజనాల దృష్ట్యా ఒక సమగ్ర బిల్లును తెచ్చేందుకు హామీ ఇవ్వాలని కోరా. కానీ ఆయన స్పందించలేదు. అలాంటప్పుడు నా వద్ద ఉన్న ప్రత్యామ్నాయాలేంటి? వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ప్రయోజనాలు పరిరక్షిస్తుంది’అని పేర్కొన్నారు. ఆర్టికల్‌ 368 ప్రకారం.. మూడింట రెండు వంతుల మంది ఆమోదించాల్సి ఉన్నందున దీనిపై ఓటింగ్‌ జరగదని రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. అయితే విపక్షాల సభ్యులు లేచి సభకు హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆమోదిస్తే సరిపోతుందని, మొత్తం రాజ్యసభ సభ్యులు అవసరం లేదని పేర్కొన్నారు. కొద్దిసేపు సభలో వాగ్వాదం కొనసాగింది. విజయసాయి రెడ్డికి మద్దతుగా నిలిచిన సభ్యులంతా పెద్దెత్తున నిరసన వ్యక్తం చేశారు. అయినా మంత్రి తన వాదన నుంచి వెనక్కి తగ్గలేదు. దీంతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ‘మంత్రి పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. మీరు రూలింగ్‌ ఇస్తారు. ఇది సరే. కానీ ఈ అభ్యంతరాన్ని ఆయన నేను బిల్లును ప్రతిపాదించినప్పుడే ఎందుకు చేయలేదు. రాష్ట్రపతి వద్దకు బిల్లు వెళ్లినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. న్యాయమంత్రి బిల్లుపై చర్చ జరిగిన తరువాత ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సమర్థనీయం కాదు. ప్రభుత్వం సహకరించనందున, సభా నిబంధనలు పాటించనందున, ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తంచేస్తూ వాకౌట్‌ చేస్తున్నా..’అని సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement