సాక్షి, హైదరాబాద్ : టీడీపీ-ఆంధ్రజ్యోతి దొంగ సర్వేపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. ‘తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కూటమికే మొగ్గు అంటూ లగడపాటితో కలిసి మస్కా కొట్టబోతే చెంప చెళ్ళుమనే తీర్పు ఇచ్చారు జనం. ఆ వాతలింకా మాననే లేదు. మళ్ళీ ‘మా బాబుకే పట్టాభిషేకం’ అంటూ అదే ఆస్థాన ‘జ్యోతి’ష్యుడు ఓ దొంగ సర్వేతో ఆంధ్రుల కళ్ళు కప్పబోయి బొక్కబోర్లా పడ్డాడు. సిగ్గు లేని జన్మ!’ అంటూ ఆయన చురకలింటించారు.
చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా నిజం మాట్లాడారా? అని ప్రశ్నిస్తూ మరో ట్వీట్‌లో మండిపడ్డారు. జమ్మలమడుగు సభలో వైఎస్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు ప్రజలు చంద్రబాబుపై ఉమ్ముతున్నారని, కేటీఆర్ స్వయంగా జగన్‌ను కలిసి 42 మంది ఎంపీలతో కేంద్రంపై వత్తిడి తెద్దామని కోరిన సంగతి మర్చిపోయారా? అని నిలదీశారు. ప్రజలకు మాత్రం బాగా జ్ణాపకం ఉందన్నారు.
టీడీపీ126 నుంచి 135 ఎమ్మెల్యే సీట్లు, 18 నుంచి 22 ఎంపీ సీట్లు గెలవనుందని ప్రముఖ సంస్థ లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ సర్వేలో వెల్లడైనట్లు ఆంధ్రజ్యోతి ప్రచురించిన సర్వే బూటకమని తేటతెల్లమైన విషయం తెలిసిందే. అసలు తాము ఎలాంటి సర్వే చేయలేదని లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ స్పష్టం చేయడం.. తమ సంస్థ పేరును దుర్వినియోగం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో చంద్రబాబు బాగోతం ప్రజలకు తెలిసివచ్చింది. మరోవైపు.. దొంగ సర్వేతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నించిన టీడీపీ, దాని తోక పత్రిక ఆంధ్రజ్యోతి మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పలువురు ఫిర్యాదులు చేశారు.
చదవండి: తోకపత్రిక దొంగ సర్వే
Comments
Please login to add a commentAdd a comment