
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ముందు పసుపు-కుంకుమ పేరుతో మహిళలను కించపర్చాలని చూసిన చంద్రబాబుకు ఒళ్లంతా ఉప్పూ-కారం పూసి బద్ధిచెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితం అనంతరం ఆయన వరుస ట్వీట్లతో చంద్రబాబు... ఆయన అనుకూల మీడియాపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ‘కుట్రలు, కుతంత్రాలు, వంచనలు, అబద్ధాలు, యూ-టర్నులు, వేల కోట్ల పంపిణీలు ప్రజలను ఏమాత్రం ఏమార్చలేక పోయాయి. పసుపు-కుంకుమ పేరుతో మహిళలను కించపర్చాలని చూస్తే వళ్ళంతా ఉప్పూ-కారం పూసి బుద్ధి చెప్పారు. నీ అంత దిగజారిన నీచుడు ప్రపంచంలోనే ఎక్కడా కనిపించడు చంద్రబాబూ.’ అంటూ మండిపడ్డారు.
‘ఒక యువ నాయకుడిపై ప్రజలు ఇంత అపూర్వమైన ప్రేమ, అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించడం దేశ చరిత్రలోనే అరుదు. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పని కుటుంబానికి ప్రజలు నీరాజనం పలికారు. అభివృద్ధిలో దేశానికే వెలుగు దివ్వెగా మారుతుంది ఆంధ్రప్రదేశ్. దేశమంతా ఏపీ వైపు ఆశ్చర్యంగా చూస్తోంది.’ అన్నారు. ఇక చంద్రబాబు పాదం మోపిన చోటల్లా ప్రాంతీయ పార్టీలకు శని దాపురించిందని, గతంలో 33సీట్లు గెలిచిన మమత ఈసారి 22 స్థానాలకే పరిమితమయ్యారన్నారు. ఢిల్లీలోని 7 సీట్లలో అయితే కేజ్రీవాల్ ఖాతా కూడా తెరవలేదని, బీఎస్పీ 38 సీట్లలో నిలిస్తే 11 చోట్ల గెలిచిందని తెలిపారు. అఖిలేశ్ 6 దగ్గర ఆగాడని, కుమార స్వామికి ఒక్కటే సీటు వచ్చిందని పేర్కొన్నారు.
‘కులమీడియా దళారులు ఎంత సిగ్గుమాలిన వార్తలు రాశారు. చంద్రబాబు ప్రధాని రేసులో ఉన్నాడని కూడా రాశారు. ప్రతిపక్ష కూటమికి మీరే నాయకత్వం వహించాలని అఖిలేశ్ యాదవ్ అనకున్నా అన్నట్టు చూపించారు. జర్నలిజాన్ని చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టారు గదా.’ అంటూ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment