సాక్షి, అమరావతి : అధికారంలో ఉన్నప్పుడు చేసినవన్నీ చేసి.. ఇప్పుడేమో ఓటమికి కారణాలు తెలియట్లేదంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నంగనాచి డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి మండిపడ్డారు. తన హామీ అయిన రుణమాఫీని అమలు చేయాలన్న చంద్రబాబునాయుడుపై బుధవారం ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. రుణమాఫీ హామీతో 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఐదేళ్లపాటు మాఫీ సొమ్ము చెల్లించకుండా రోజుకో కథ చెబుతూ వచ్చారని, తీరా ఓడిన తర్వాత కొత్త ప్రభుత్వం తన హామీని నెరవేర్చాలని సిగ్గులేకుండా డిమాండ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మాట తప్పిన చంద్రబాబును రైతులే నిలదీయాలని సూచించారు.
ఓటమి తప్పదని గ్రహించే పుత్ర రత్నం లోకేశ్ చేత ఎమ్మెల్సీకి రాజీనామా చేయించకుండానే మంగళగిరి నుంచి బరిలో దింపారన్నారు. ఎన్నికలకు ముందే తమ వాళ్ళకు పోస్టింగులు, ప్రయోషన్లిచ్చారని, పోలింగ్ తర్వాత అప్పులు తెచ్చి మరీ కాట్రాక్లర్ల బిల్లులు చెల్లించారని తెలిపారు. ఇప్పుడేమో ఓటమికి కారణాలు తెలియట్లేదంటూ నంగనాచి డ్రామాలు ఆడుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. రైతు భరోసా పథకం, ధరల స్థిరీకరణ నిధి వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. రైతుల మోముల్లో చిరునవ్వులు పూస్తాయని, సేద్యం ఇక పండుగ అవుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment