
దేవీచౌక్ (రాజమహేంద్రవరం): చంద్రబాబు పాలనలో పారదర్శకత అనేది లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. పారదర్శకతతో కూడిన అవినీతిరహిత పాలనను అందిస్తానని రాష్ట్ర నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ తన తండ్రిలాగే ముక్కుసూటిగా మాట్లాడారని అభినందించారు.
చంద్రబాబు పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెంపుదలకు ప్రాజెక్టు అథారిటీ అనుమతి తీసుకున్నారా? కేబినెట్ ఆమోదం తెలిపిందా? అని తాను అధికారులను అడిగితే ఇప్పటివరకు సమాధానం లేదన్నారు. రాజధాని ప్రకటన వెలువడ్డాక, అక్కడ భూముల కొనుగోలుపై రికార్డుల తనిఖీకి అనుమతి కోరితే దానికీ స్పందించడం లేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసిన అధికారులతో జగన్ మాట్లాడాలని, రేపోమాపో నీళ్లు ఇస్తామనే బూటకపు హామీలు ఇవ్వకుండా వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలని కోరారు. కేంద్రం నుంచి మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినవాటిపై వెనుకకు తగ్గకుండా పోరాడాలన్నారు.
చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి
గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ఒంటి చేత్తో 50 శాతం ఓట్లు తెచ్చుకున్నారని ఉండవల్లి కొనియాడారు. జగన్ చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాలని, ఏ చిన్న తప్పు దొర్లినా పెద్దదిగా చూపే ప్రయత్నాలు జరుగుతాయన్నారు. బాబు వాగ్దానాలను ప్రజలు నమ్మలేదని, మితిమీరిన ప్రచారమే టీడీపీని దెబ్బకొట్టిందన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తే.. అక్కడ కూడా అధిక స్థానాల్లో టీడీపీకి ఎందుకు ఓటమి ఎదురైందని ప్రశ్నించారు. నాడు జగన్ అసెంబ్లీలో ఏ అంశం లేవనెత్తినా లక్ష కోట్ల అవినీతి అని నానా యాగీ చేశారని, దానితో ఆయన ప్రజల మధ్యకు వెళ్లి ఘనవిజయం సాధించారని చెప్పారు. సీఎంగా జగన్ అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.