సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించడమే తమకు ప్రధానమని, హోదా ఎవరిస్తే వారికి మద్దతిచ్చేందుకు తాము సిద్ధమని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతిచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు.
చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న జగన్ ‘సీఎన్‌ఎన్‌న్యూస్ 18’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ భూపేన్ చౌబేకు సోమవారం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వమే అబద్ధాలమయమని, అసలు ఆయన అబద్ధాలాడే అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రజలకు భ్రమలు కల్పించడమే తప్ప ఏపీ రాజధాని శాశ్వత నిర్మాణానికి ఒక్క ఇటుకను కూడా ఈ నాలుగేళ్లలో చంద్రబాబు వేయలేదని జగన్ దుయ్యబట్టారు. తన మీద కేసులన్నీ కాంగ్రెస్, టీడీపీ కుట్రతో బనాయించినవేనని ఆయన వివరించారు. ఇంటర్వ్యూ ఈ విధంగా సాగింది.
- 2014 లోక్‌సభ ఎన్నికల్లో మీ బలం ఏమిటి? ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో మీరు చూస్తున్న మార్పు ఏమిటి?
2014లో చంద్రబాబు, బీజేపీ కలిసి సినీనటుడు పవన్ మద్దతుతో నాపై తలపడ్డారు. వారంతా కలిసి పోటీ చేసినా మా కన్నా కేవలం 1.5 శాతం ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 44.5 శాతం ఓట్లు వస్తే, వారికి సుమారు 46 శాతం ఓట్లు వచ్చాయి. దీనికి కారణం కేవలం చంద్రబాబు అబద్ధాలే...రూ 87,612 కోట్ల మేరకు రైతు రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని, సుమారు రూ 15,000 కోట్ల నుంచి రూ 16,000 కోట్ల వరకూ ఉన్న స్వయం సహాయక గ్రూపుల రుణాలను కూడా మాఫీ చేస్తానని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. రైతులను, మహిళలను అసలు బ్యాంకులకు బకాయిలు చెల్లించవద్దన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఇవ్వలేక పోతే రూ 2,000లు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. మోదీ హవా కూడా చంద్రబాబుకు ఉపయోగపడింది.
- అమరావతి నిర్మాణంలో చంద్రబాబు వృథాగా ఖర్చు పెడుతున్నారని, బాహుబలి దర్శకుడు రాజమౌళిలాంటి వారిని రప్పించి అనవసరంగా నిధులు ఖర్చు పెడుతున్నారనే విమర్శలున్నాయి. రాజధాని నిర్మాణం అనేది అబద్ధమేనంటారా?
చంద్రబాబు ప్రభుత్వమే అబద్ధాల మయం. అబద్ధాలతోనే ఆయన అధికారంలోకి వచ్చారు. ఇప్పటికీ నిరంతరం అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. జీఎస్‌డీపీలో ఆయన చెబుతున్న తప్పుడు లెక్కలే నిదర్శనం. రాజధాని నిర్మాణం విషయానికి వస్తే ఇప్పటికి శాశ్వత సచివాలయానికి గాని, శాశ్వత అసెంబ్లీ, హైకోర్టుకు గాని ఈ నాలుగేళ్లలో ఒక్క ఇటుకను కూడా వేయలేదు. ఈయనకన్నా ఒక గుడ్డి వ్యక్తికి పదవి ఇచ్చి ఉంటే మెరుగ్గా పనిచేసేవారు.
- 2019లో బీజేపీతో భాగస్వాములయ్యేది ఎవరు?
మా విధానం సుస్పష్టం. ఏపీ బాగు పడాలంటే ప్రత్యేక హోదా కావాలని చాలా కాలంగా మేం కోరుతున్నాం. పార్లమెంటులో అప్పటి ప్రధాని మాకు దీనిపై హామీ ఇచ్చారు. కాంగ్రెస్సే కాదు, ప్రతిపక్షంలో ఉండిన బీజేపీ కూడా మాకు ఆరోజు హామీ ఇచ్చింది. ప్రత్యేక హోదా లేకుండా మేం పొరుగు రాష్ట్రాలతో పోటీ పడలేం. చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ఈ రోజుకూ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వైపే చూస్తున్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ, చెన్నైతో కూడిన తమిళనాడు, బెంగళూరుతో కూడిన కర్నాటకతో మేం పోటీ పడలేం. అక్కడి మౌలిక సదుపాయాలు మన వద్ద లేవు. ఏమీ లేనప్పుడు మావద్దకు విజయవాడ, గుంటూరులో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు?
- ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని మీరు చెబుతున్నారు కదా.. అలాంటి ముఖ్యమంత్రితో మీరు పోవద్దని, మీ మద్దతు బీజేపీకి అవసరం అవుతుందని, మీరు సంకేతాలు ఇస్తున్నారా? తమిళనాడులో రాజా మీద ఉన్న కేసులన్నీ కొట్టేశారు. ఇక్కడ మీ కేసులు ఇంకా ఉన్నాయి కదా?
నా కేసులకు సంబంధించి మీరు తెలుసుకోవాలి. మా నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంత వరకూ నేను గౌరవప్రదమైన వ్యక్తినే. కాంగ్రెస్ దృష్టిలో కూడా వైఎస్ గౌరవనీయమైన వ్యక్తే... ఆయన చనిపోయాక, నేను కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాతనే నాపై అక్రమంగా కేసులు కుట్రపూరితంగా పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే శంకర్‌రావు (తరువాత ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు),టీడీపీకి చెందిన ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతిరాజు నాకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేశారు.
- ఇంతకూ 2019లో మీరు ఎవరికి మద్దతు నిస్తారు?
మద్దతుకు సంబంధించినంత వరకూ... మాకు ఒకటే అంశం ఉంది. అది ప్రత్యేక హోదా... అది బీజేపీ కావచ్చు. మరొకరు కావచ్చు. ప్రత్యేక హోదాను ప్రధానమంత్రి ఒక్క సంతకంతో మంజూరు చేయవచ్చు. హోదా ఇవ్వడానికి బీజేపీ ముందుకు వస్తే నేను వారితో వెళ్లడానికి సిద్ధం. ఇందులో దాపరికం లేదు. మేం ఎప్పటి నుంచో ఇదే చెబుతూ వస్తున్నాం.
- చంద్రబాబు తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారని, అలాంటి వారితో ఉంటూ మీరు కూడా తప్పు చేస్తున్నారని మీ పాదయాత్ర ద్వారా బీజేపీకి సందేశం పంపదల్చుకున్నారా?
జాతీయ పార్టీలకు రాష్ట్రంలో అంత బలం ఏమీ లేదు. మాకు కావాల్సిందల్లా ప్రత్యేక హోదా... ప్రధానిగా అది మోదీ అభీష్టంపై ఆధారపడి ఉంటుంది. పార్లమెంటులో ఇచ్చిన హామీని గౌరవించండి అని మేం కోరుతున్నాం. బీజేపీ కనుక ప్రత్యేక హోదా ఇస్తే... మేం వారికి మద్దతిస్తాం. ఇందులో రెండో మాటే లేదు. ఏపీలో ప్రస్తుతం మా లక్ష్యం చంద్రబాబునాయుడే...
ప్రత్యేక హోదానే మాకు ప్రధానం
Published Mon, Jan 22 2018 9:06 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment