
సాక్షి, న్యూఢిల్లీ : ‘మోదీజీ ఇప్పటికే విజయం సాధించారు. ఇక ఆయనకు ఓటు వేయాల్సిన అవసరం లేదన్న వాతావరణాన్ని సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. అలాంటి మాటల మాయలో పడొద్దు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఓటేయండి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లను ఉద్దేశించి శుక్రవారం నాడు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. ఆయన వారణాసి నుంచి తన నామినేషన్‌ను దాఖలు చేసిన తర్వాత ప్రజలనుద్దేశించి విలేఖరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రచారాన్ని ఎవరో ప్రత్యర్థులు చేయలేదు. ‘మోదీ హీ ఆయేగా’ అంటూ సొంత పార్టీనే చేసింది.
అది ప్రచారానికి ట్యాగ్‌లైన్‌గా మారడంతో ‘బీజేపీ గెలవడం ఖాయం, ప్రధాని అవడం ఖాయం. అలాంటప్పుడు ప్రయాసపడి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేయాల్సినంత అవసరం ఉందా!’ నిర్లక్ష్యంతో కూడిన బద్దకం ఓటర్లను ఆవహించే అవకాశం ఉందన్న శంక మోదీ మదిలో మెదిలినట్లు ఉంది. ఇందుకు ఆయన వ్యక్తిగతంగా చేసుకుంటున్న అతి ప్రచారం కూడా కారణం కాబోలు. వారణాసిలో అతిపెద్ద ర్యాలీ నిర్వహించిన మోదీ, ఆ మరుసటి రోజు ఎన్డీఏ మహా మహులు తోడురాగా అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేయడం తెల్సిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఆయన ‘ఇండియాటుడే ఆజ్‌తక్’కు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా వ్యక్తిగత ప్రచారంలో భాగమేగదా!
Comments
Please login to add a commentAdd a comment