
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం నాడు కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేసి రోడ్డు షో ప్రారంభించారు. మెజారిటీ వర్గం ఎక్కువగా ఉండే నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు భయపడిన రాహుల్ గాంధీ మైనారిటీలు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాన్ని ఆశ్రయించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించిన విషయం తెల్సిందే. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో మెజారిటీ, మైనారిటీ వర్గానికి పెద్ద తేడా ఏమీ లేదు. ఈ నియోజకవర్గంలో ముస్లింలు 45 శాతం ఉండగా, హిందువులు 41 శాతం ఉన్నారు. అదే వయనాడ్ జిల్లా పరంగా చూస్తే హిందువుల జనాభానే ఎక్కువ. ఇక నియోజకవర్గంలో 13 శాతం మంది క్రైస్తవులు కూడా ఉన్నారు. ఆదివాసీలు వారికన్నా ఎక్కువ.
వయనాడ్ నియోజక వర్గం ప్రజలు స్థానిక సమస్యలనే పట్టించుకుంటున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చినవారికి, ఆ దిశగా కృషి చేస్తారన్న నమ్మకం ఉన్నవారికే ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారు. స్థానిక ఆదివాసీలకు తిరిగి భూ పంపిణి, వాణిజ్య పంటలు వరదల్లో కొట్టుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను నష్ట పరిహారం, వరదలు, కొండ చెరియలు విరిగి పడడంతో నిరాశ్రియులైన వారికి పునరావాసం ఇక్కడి ప్రజల ప్రధాన డిమాండ్లు.
మూడు జిల్లాల పరిధి
వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వయనాడ్‌తోపాటు మలప్పురం, కోజికోడ్ జిల్లాలు వస్తాయి. ఇక్కడ 13.36 లక్షల ఓటర్లు ఉన్నారు. 2011లో జరిగిన సెన్సెస్ ప్రకారం ఈ నియోజకవర్గం జనాభాలో 18.5 శాతం మంది ఆదివాసీలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 140 అసెంబ్లీ సీట్లు ఉన్నప్పటికీ రెండు సీట్లు మాత్రమే ఆదివాసీలకు రిజర్వ్‌చేసి ఉన్నాయి. 1970 దశకం నుంచి వయనాడ్‌లో ఆదివాసీలు ఇతరులకు భూములు కోల్పోతూ వచ్చారు. అనతికాలంలోనే వారు భూములు మొత్తం కోల్పోయి ఆకలి చావులకు గురవుతూ వచ్చారు. ఆదివాసీలకు తిరిగి భూములు ఇప్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయలేకపోయాయి.
1975లోనే భూ బదిలీ చట్టం
అన్యుల నుంచి ఆదివాసీలకు భూములను తిరిగి బదిలీ చేస్తూ 1975లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా ఈ చట్టాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాయి. 2001లో కేరళ రాష్ట్రమంతా ఓనం (పంటల) పండుగ జరుపుకుంటుంటే 31 మంది ఆదివాసీలు ఆకలితో మరణించారు. దాంతో ఆదివాసీ దళిత కార్యాచరణ కమిటీ ఆధ్వర్యాన ఆదివాసీలు మొదటిసారి భారీ ఆందోళనను చేపట్టారు. వేలాది మంది ఆదివాసీలు తిరువనంతపురం రాష్ట్ర రాజధాని నగరాన్ని చుట్టుముట్టారు.
సీఎం కార్యాముందు గుడిసెలు
సీఎం కార్యాలయం ముందు గుడిసెలు వేశారు. అందుబాటులో ఉన్న భూములను బట్టి భూములు లేని దళితులకు ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు ఇస్తామని నాటి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో 48 రోజుల అనంతరం ఆదివాసీలు సీఎం కార్యాలయం ముందు ఆందోళన విరమించారు. ఆ తర్వాత 2003లో మరోసారి ఆదివాసీలు ఆందోళన చేశారు. అప్పటికి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో 2014లో కూడా ఆదివాసీలు ఆందోళన చేశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ మేరకు ఆదివాసి గోత్ర మహాసభ ఆధ్వర్యంలో 162 రోజులపాటు కొనసాగించిన ఆందోళనను ఆదివాసీలు విరమించారు.
రైతుల ఆత్మహత్యలు
గత 20 ఏళ్ల కాలంలో వయనాడ్ నియోజకవర్గంలో దాదాపు రెండు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడమే కాకుండా బ్యాంకుల రుణాలను చెల్లించలేకనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామన్న పార్టీ అభ్యర్థికే తాము ఓటు వేస్తామని స్థానిక ఓటర్లు చెబుతున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీయే తమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఆయన ఈ సమస్యలను పరిష్కరిస్తారన్న నమ్మకం తమకు ఉందని, అయితే ఆయన పార్టీ కేంద్రంలోగానీ, ఇటు రాష్ట్రంలోగానీ అధికారంలోకి రావాలికగదా! అని వారంటున్నారు. (చదవండి: కేరళ నుంచి రాహుల్ పోటీ ఎందుకు?)
Comments
Please login to add a commentAdd a comment