
ఆదివారం నాగోలులో జరిగిన విశ్వబ్రాహ్మణ సంఘం ఆత్మగౌరవ సభలో అభివాదం చేస్తున్న ఎల్.రమణ, బండారు దత్తాత్రేయ, జస్టిస్ బి.చంద్రకుమార్, దాసోజు శ్రవణ్ తదితరులు
హైదరాబాద్: విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి కోసం బీజేపీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌లో తెలంగాణ విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ.. త్వరలోనే జాతీయ స్థాయిలో బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. విశ్వబ్రాహ్మణులను రాజకీయంగా ప్రోత్సహించేందుకు తమ పార్టీ పలువురికి ఎమ్మెల్యే సీట్లు కేటాయించిందన్నారు.
విశ్వబ్రాహ్మణుల కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని కామన్ మిని మం ప్రోగ్రామ్‌లో పెట్టేందుకు కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. అహంకారాని కి, ఆత్మగౌరవానికి మధ్య జరిగే ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ద్రోహులను ప్రోత్సహిస్తూ.. ఉద్యమ సమయంలో బలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు మాత్రం టీఆర్‌ఎస్ అన్యాయం చేసిందన్నారు.
అడుక్కుంటే హక్కులు రావని.. పోరాడి సాధించుకోవాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు బిక్షపతి కోరారు. కార్యక్రమంలో జస్టిస్ బి.చంద్రకుమార్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తల్లోజు ఆచారి, ఎంబీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.సి.కాలప్ప, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment