సాక్షి, బెంగళూర్ : యూపీలో తుపాను బీభత్సంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఆ రాష్ట్ర సీఎం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలడాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించడంపై యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. సిద్ధరామయ్య అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తుడని వ్యాఖ్యానించారు. భారీ వర్షాలు, ఇసుక తుపాన్‌లు ముంచెత్తిన ప్రాంతాల్లో పరిస్థితిపై తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించానని, సహాయ చర్యలపై అధికారులతో మాట్లాడానని యోగి చెప్పుకొచ్చారు.
వరద ప్రభావిత ప్రాంతాలను శనివారం తాను సందర్శిస్తున్నానని చెప్పారు. శుక్రవారం రాత్రికి ఆగ్రా చేరుకుని రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తానని యోగి ఆదిత్యానాథ్ పేర్కొన్నారు. యోగి, సిద్ధరామయ్యల మధ్య కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో గతంలోనూ మాటల తూటాలు పేలాయి. గత ఐదేళ్లలో రాష్ట్రానికి సిద్ధరామయ్య చేసిందేమీ లేదని యోగి విమర్శించగా, ఆయన బీజేపీకి మైనస్ పాయింట్ అని సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలు, గోవధ వంటి అంశాలపైనా ఇరువురు నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment