
లక్నో : దేశంలోని ప్రతి కుటుంబం రామమందిర నిర్మాణానికి 11రూపాయలతో పాటు ఒక ఇటుకను ఇవ్వాలని యూపీ ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ కోరారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి నాగేంద్ర మహతోకు మద్దతుగా భాగోదర్ ర్యాలీలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషి వల్లే 500 సంవత్సరాల వివాదం పరిష్కారమైందన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎంఎల్ లాంటి రాజకీయ పార్టీలకు వివాదం పరిష్కారమవ్వడం ఇష్టం లేదన్నారు. అయోధ్యలో రామ్‌మందిర్ నిర్మాణం త్వరలోనే సాకారమవుతుందన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించాలని కోరారు.
జైశ్రీరాం నినాదాలతో ఆయన ప్రజలను ఉత్తేజపరిచారు. తాను రాముడి స్వస్థలం నుంచి వచ్చానన్నారు. రాముడి పాలనంతా రామరాజ్యమేనని కొనియాడారు. సమాజంలోని పేద, యువత, మహిళలు సహా అన్ని వర్గాలను అభివృద్ధి పరచమే తమ అభిమతమని తెలిపారు. నరేంద్ర మోదీ పాలనలో అన్ని వర్గాలు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. ఏ వర్గానికి న్యాయం చేయకుండానే కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎమ్‌ఎమ్) లాంటి రాజకీయ పార్టీలు అధికారం కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో కాంగ్రెస్, ఆర్‌జేడీ, జేఎమ్‌ఎమ్ పార్టీలు విఫలమయ్యావని మండిపడ్డారు. ఆర్టికల్ 370 వల్ల దేశంలో ఉగ్రవాదం పెరుగుతుందని భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. మోదీ కోరుకుంటున్న ఏక్ భారత్ శ్రేష్ట భారత్ ఆశయాన్ని బలపరచాలని యోగీ అధిత్యనాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment