లక్నో : రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుపొందిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే యోగి సర్కారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బుధవారం తొలిసారిగా మంత్రివర్గ విస్తరణ చేపట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిథ్యం కల్పించారు. కొత్తగా ఐదుగురు మంత్రులకు కేబినెట్ హోదా కట్టబెట్టిన యోగి.. కొత్తగా మరో 18 మందికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. వీరిలో ఆరుగురు బ్రాహ్మణులు, నలుగురు క్షత్రియులతో పాటు పలువురు వైశ్య, గుజ్జార్, జాట్, లోధి, కశ్యప సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే విధంగా దళిత సామాజికవర్గానికి చెందిన కమల్ రాణి వరుణ్‌కు కేబినెట్ హోదా కల్పించారు. ఇక అదే సామాజిక వర్గానికి చెందిన శ్రీరాం చౌహాన్, గిరిరాజ్ సింగ్ ధర్మేశ్ యోగి కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు.
ఈ విషయం గురించి బీజేపీ అధికార ప్రతినిధి సమీర్ సింగ్ మాట్లాడుతూ...‘ కొత్త మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేశాము. అంతేకాకుండా సీనియర్ నాయకులతో పాటు యువ ఎమ్మెల్యేలకు సరైన ప్రాతినిథ్యం కల్పించాము అని పేర్కొన్నారు. కాగా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గంలో కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టడం రాజకీయ ఎత్తుగడలో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీజేపీ 62, బీఎస్పీ 10, ఎస్పీ 5 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ కేవలం ఒకే ఒక స్థానం(సోనియా గాంధీ- రాయ్‌బరేలీ)లో గెలుపొందిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment