
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. దాణా కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూ అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఆస్పత్రికి వెళ్లిన రాహుల్ లాలూతో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఇక ఈ భేటీపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘లాలూతో రాహుల్ గాంధీకి ఏం పని?. ప్రజల్లో అవినీతి అంటూ ఉపన్యాసాలు దంచే రాహుల్.. అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్న లాలూను కలవటంలో ఆంతర్యం ఏంటి. ఈ భేటీపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలి’ అని యోగి డిమాండ్ చేశారు. జన ఆక్రోశ్‌లో అధికార పక్షంపై విరుచుకుపడిన రాహుల్ ఆ మరుసటి రోజే లాలూతో భేటీ కావటం.. పైగా చర్చల్లో కొనసాగుతున్న వేళ లాలూ-రాహుల్ భేటీ ఆసక్తికరంగా మారింది.
ఆస్పత్రిలోనే ఉంటా...
లాలూ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావాల్సి ఉంది. అయితే తన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని.. ఇంకా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటానని ఎయిమ్స్ వైద్యాధికారులకు లాలూ ఓ లేఖ రాశాడు. రాంచీకి తరలించాక తనకేమైనా జరిగితే ఎయిమ్స్ వైద్యులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాంచీ జైలు అధికారులతో చర్చించి వైద్యులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు.